రూ.300.42 కోట్ల పొగాకు విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

రూ.300.42 కోట్ల పొగాకు విక్రయాలు

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.300.42 కోట్ల విలువైన 12.41 మిలియన్‌ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. వేలానికి తీసుకవచ్చిన బేళ్లలో 40 శాతం బేళ్లను ట్రేడర్లు తిరస్కరిస్తున్నారు. పొగాకు బేళ్లు ఎక్కువ రోజులు ఇంటి వద్ద నిల్వ ఉండటంతో నాణ్యత, రంగు దెబ్బ తింటాయనే భయంతో వచ్చిన కాడికి అమ్ముకుని, అప్పులు తీర్చుకునేందుకు చిన్న, సన్నకారు రైతులు వేలం కేంద్రాలకు తెస్తున్నారు. అయితే, గిట్టుబాటు ధర లభించకపోగా, తీసుకు వచ్చిన బేళ్లను తిరస్కరిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఐదు వేలం కేంద్రాల్లో గురువారం 4,957 బేళ్లు అమ్మకానికి రాగా, 1,815 తిరస్కరించారు. 3,142 బేళ్లు కొనుగోలు చేశారు. మొత్తం 4.05 లక్షల కిలోల పొగాకు విక్రయించారు. కిలోకు గరిష్టంగా రూ.276, కనిష్టంగా రూ.160, సగటున రూ.242.05 చొప్పున ధర లభించింది. దేవరపల్లి వేలం కేంద్రానికి 648, జంగారెడ్డిగూడెం–1కు 1,344, జంగారెడ్డిగూడెం–2కు 1,170, కొయ్యలగూడేనికి 1,248, గోపాలపురం వేలం కేంద్రానికి 547 చొప్పున బేళ్లు అమ్మకానికి వచ్చాయి. కిలోకు సగటు ధర దేవరపల్లిలో రూ.227.55, జంగారెడ్డిగూడెం–1లో రూ.236.62, జంగారెడ్డిగూడెం–2లో 223.30, కొయ్యలగూడెంలో రూ.234.67, గోపాలపురంలో రూ.245.44 చొప్పున లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement