ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పర్యటన గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. అధినేత నింపిన స్ఫూర్తితో నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా గిట్టుబాటు ధర దక్కక, పెట్టుబడీ వెనక్కు రాక ఆర్థికంగా చితికిపోయిన పొగాకు రైతుల్లో భరోసా నింపేందుకు వైఎస్‌ జగన్‌ బుధవారం దేవరపల్లిలో పర్యటించిన విషయం తెలిసిందే. మన కోసం జగనన్న వచ్చారంటూ ఆయనకు రైతులు తమ కష్టాలు చెప్పుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని విధాలా మోసపోయామని.. మళ్లీ జగన్‌ వస్తేనే మంచి రోజులొస్తాయని గద్గద స్వరంతో గుండెల్లోని మాట చెప్పారు. వారి వేదన విన్న జగన్‌ మంచి రోజులొస్తాయని, ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు.

కుట్రలను చీల్చుకుని కదిలిన అభిమానం

వైఎస్‌ జగన్‌ దేవరపల్లి పర్యటన రెండు వారాల క్రితమే నిర్ణయమైంది. అప్పటి నుంచే కూటమి పెద్దల గుండెల్లో దడ మొదలైంది. తాము పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పటికీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతుల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. అది గమనించిన ప్రభుత్వం కిలో పొగాకుకు రూ.10 పెంచుతున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ రైతుల్లో ఆగ్రహం తగ్గలేదని భావించి జగన్‌ పర్యటన సఫలం కాకుండా చేసేందుకు కుట్రలకు తెర లేపారు. అధినేత పర్యటనకు వైఎస్సార్‌ సీపీ ముందుగానే నాయకులు పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ అవసరమైన మేరకు రక్షణ కల్పించలేదు. హెలిప్యాడ్‌, పొగాకు వేలం కేంద్రం వద్ద పోలీసుల జాడే కనిపించలేదు. మరోవైపు జననేతను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలివస్తున్న వేలాది మందిని దేవరపల్లి వైపు వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు సర్వశక్తులూ ఒడ్డారు. వైఎస్‌ జగన్‌ పర్యటనను గాలికొదిలేసి, దేవరపల్లి చేరుకునే నాలుగు మార్గాల వద్ద భారీగా మోహరించారు. బైక్‌లు, కార్లపై వస్తున్న వారిని జగన్‌ పర్యటనకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అయితే, ఈ కుట్రలను ఛేదించుకుని మరీ పలువురు తమ అభిమాన నేతను చూసేందుకు తోటలు, పొలాల్లో నుంచి దేవరపల్లికి చేరుకున్నారు. మరికొంత మంది పోలీసులు ఆపేసిన చోటే వాహనాలు వదిలేసి పొగాకు వేలం కేంద్రానికి కాలి నడకన తరలివచ్చారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల అభిమానం ముందు అవి నిలవలేదు.

శ్రీస్థానికశ్రీ పోరుకు.. ఉరిమే ఉత్సాహంతో..

బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నికల హామీలు అమలు చేయని సర్కారుపై సంక్షేమ ఫలాలు అందని పేద, బలహీన వర్గాల ప్రజలు రగిలిపోతున్నారు. దీనికితోడు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై యువజనం ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఈ అవకతవకలపై వైఎస్సార్‌ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించారు. అదే ఉత్సాహంతో టౌన్‌ హాలు సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌ జిల్లాలో పర్యటించడంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి రావడంతో వారి మద్దతుతో శ్రీస్థానికశ్రీ పోరులో పైచేయి సాధిస్తామని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉత్సాహంతో చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మార్చుకుని పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్నారు.

దేవరపల్లిలో రైతుపోరు విజయవంతం

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన

వైఎస్‌ జగన్‌

స్వచ్ఛందంగా తరలివచ్చిన

రైతులు, జెన్‌జీ

వెల్లువెత్తిన ప్రజాభిమానం ముందు ప్రభుత్వ పెద్దల కుట్రలు పటాపంచల్‌

జగన్‌తోనే జెన్‌జీ

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, స్పోర్ట్స్‌ కోటా పేరిట ఉద్యోగాలు అమ్మేసుకోవడం, నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా జెన్‌జీ చంద్రబాబు అండ్‌ కో తీరుతో విసిగిపోయారు. దేవరపల్లిలో బుధవారం కనిపించిన దృశ్యమే ఇందుకు సాక్ష్యం. జనహృదయ నేత జగన్‌కు అడుగడుగునా జెన్‌జీ యువతే ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని ఘన స్వాగతం పలికారు. అభిమాన నేతపై పూలవర్షం కురిపించారు. అదిగో జగనన్న వచ్చాడు.. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో జెన్‌జీ మద్దతు కోసం అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్న వేళ.. వైఎస్‌ జగన్‌కు యువతరం స్వచ్ఛందంగా మద్దతు తెలపడం కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై గూడు కట్టుకున్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే జగన్‌కు మద్దతుగా జెన్‌జీ నడుస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement