ఉత్తిపోతలే! | - | Sakshi
Sakshi News home page

ఉత్తిపోతలే!

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ

తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరిపై నిర్మించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం

దేవరపల్లి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని అనేక గ్రామాలకు తాగునీరు, వందలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2015 – 19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం మొదలుపెట్టింది. కాలువల తవ్వకానికి అవసరమైన పర్యావరణ అనుమతులు పొందకుండానే పనులను ప్రారంభించింది. దీనిపై అప్పట్లో జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. పరిశీలించిన న్యాయస్థానం మూడు నెలల్లో అనుమతులు తెచ్చుకోవాలని, లేదంటే పనులు నిలుపుదల చేయాలని ఆదేశించింది. గడువులోపు అనుమతులు రాకపోవడంతో, పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయవద్దని ట్రిబ్యునల్‌ తీర్పునివ్వడంతో 2022–23 నుంచి పనులు నిలిచిపోయాయి.

రూ.73 కోట్ల జరిమానా

పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టడాన్ని ట్రిబ్యునల్‌ తప్పుపట్టి రూ.73 కోట్లు జరిమానా విధించింది. దీనిపై అప్పట్లో ప్రభుత్వం ఓ కమిటీని వేసి పనులు ఎంత వరకు అయ్యాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పనులు జరిగిన దానికి అంచనా వ్యయంపై 1.5 శాతం జరిమానా కట్టాల్సి ఉంది. నివేదిక బుట్టదాఖలు కావడంతో ట్రిబ్యునల్‌ విధించిన జరిమానా రూ.73 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

పెరిగిన అంచనా వ్యయం

చింతలపూడి ప్రాజెక్టు సకాలంలో పూర్తికాక పోవడంతో అంచనా వ్యయం రెట్టింపు అయింది. 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.4,909 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించింది. ఇప్పటికి నాలుగేళ్లుగా పనులు నిలిచిపోవడంతో అంచనా వ్యయం రూ.8,075 కోట్లు అయ్యిందని అధికారులు చెబుతున్నారు. ఎత్తిపోతల పథకం ప్రధాన పంపు హౌస్‌ నుంచి కృష్ణా జిల్లాకు 119 కిలోమీటర్లు ప్రధాన కాలువ ఏర్పాటు చేయాలి. దీనిలో గోపాలపురం ప్రాంతంలో 13 కిలోమీటర్లు లీడింగ్‌ చానల్‌, 106 కిలోమీటర్లు ప్రధాన కాలువ ఉండాలి.

4.80 లక్షల ఎకరాలకు సాగునీరు

ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని 4.10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించాలి. అయితే డిస్టిబ్యూటర్‌ చానళ్లకు కాకుండా ప్రధాన కాలువకు భూ సేకరణ పూర్తి కాలేదు. ఇందుకోసం సుమారు 9,100 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ప్రధాన కాలువపై గోపాలపురం మండలం నందిగూడెం వద్ద, ఏలూరు జిల్లా రౌతుగూడెం వద్ద పంపు హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. వీటి పనులు దాదాపు 55 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సాగునీటితో పాటు ప్రధాన కాలువకు అనుకుని ఉన్న 460 గ్రామాలకు తాగునీరు సరఫరా జరుగుతుంది.

తాగునీరు అందే ప్రాంతాలు

తాళ్లపూడి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల, టి.నర్సాపురం, లింగపాలెం, కామవరపుకోట, పెదవేగి, దెందులూరు మండలాలతో పాటు సమీప గ్రామాలకు ఈ పథకం ద్వారా తాగునీరు అందుతుంది.

చింతలపూడి ఎత్తిపోతల పథకం

నిర్మాణ ప్రారంభ అంచనా వ్యయం రూ.4,909 కోట్లు

ప్రస్తుత అంచనా వ్యయం రూ. 8,075 కోట్లు

మొదటి దశ వ్యయం రూ.1,700 కోట్లు

రెండవ దశ అంచనా వ్యయం రూ. 3,200 కోట్లు

పథకం లక్ష్యం 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు

లిఫ్ట్‌ – 1 తాడిపూడి వద్ద గోదావరిపై 14 పంపులతో

లిఫ్ట్‌ – 2 గుడ్డిగూడెం వద్ద 4 పంపులు

లిఫ్ట్‌ – 2ఏ గుడ్డిగూడెం వద్ద 10 పంపులు

లిఫ్ట్‌ – 3 రౌతుగూడెం వద్ద 6 పంపులు (జీలుగుమిల్లి ప్రాంతం)

అనుమతుల కోసం చూస్తున్నాం

పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు 2022లో నిలిచిపోయాయి. సుప్రీంకోర్టు అనుమతి కోసం చూస్తున్నాం. పర్యావరణ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టుపై తాడిపూడి, టి.నర్సాపురం, జీలుగుమిల్లి మండలాల్లో కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించారు.

– శ్రీనివాసరావు, డీఈఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం

ముందుకు కదలని

‘చింతల’పూడి ఎత్తిపోతల పథకం

తొలగని పర్యావరణ అడ్డంకులు

నిలిచిన ప్రాజెక్టు పనులు

మూడు జిల్లాలకు తాగు,

సాగునీరు ప్రశ్నార్థకం

ఎదురు చూస్తున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement