సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్‌గా 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శుభం నొఖ్వాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి నూతన సబ్ కలెక్టర్‌కు అభినందనలు తెలియజేసి, సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్‌ను, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ను నొఖ్వాల్ కలిశారు. ఆయన గతంలో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వహించారు.
నేడు దేవరపల్లికి
పొగాకు బోర్డు చైర్మన్ రాక
దేవరపల్లి: పొగాకు బోర్డు చైర్మన్ ఎన్.యశ్వంత్ కుమార్ బుధవారం దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, వేలం ప్రక్రియను పరిశీలించనున్నారు. వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ మంగళవారం ఈ విషయం తెలిపారు. చైర్మన్ ఉదయం 10.30 గంటలకు వేలం కేంద్రానికి చేరుకుంటారని, అనంతరం గోపాలపురం వేలం కేంద్రానికి వెళతారన్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని పొగాకు రైతులందరూ ఉదయం 10 గంటలకు వేలం కేంద్రానికి రావాలని కోరారు.
పెదకొండేపూడి కొండల్లో పులి
సీతానగరం: చినకొండేపూడి పంచాయతీ పరధిలోని పెదకొండేపూడి కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు మంగళవారం అటవీశాఖ అధికారులు తెలిపారు. పులికి అమర్చిన ట్రాకర్ ద్వారా ఈ విషయం గుర్తించామన్నారు. సోమవారం రాత్రి 1.45 గంటలకు సీతానగరం మండలం పెదకొండేపూడి కొండపైకి చేరుకుందన్నారు. పురుషోత్తపట్నం దగ్గరలోని రామవరపు ఆవను ఆనుకుని పెదకొండేపూడి వైపు ఉన్న కొండపైకి చేరుకున్న పులి నీటి కోసం కొండ దిగువన సంచరిస్తూ, తిరిగి కొండపైకి వెళుతోందని అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ దావీద్ రాజు తెలిపారు. రెస్క్యూ టీమ్ కొండ వద్ద మాటువేసి ఉన్నారని, చీపురుపల్లి, పెదకొండేపూడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ప్రజలు ఒంటరిగా తిరగొద్దని తహసీల్దార్ శ్రీనివాస్ కోరారు.
ఆయుష్మాన్ ఆరోగ్య
మందిరాల ప్రారంభం
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవనాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గుడివాడ నుంచి మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో నిర్మించిన 6 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవనాలను జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు, అనపర్తి ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డీఆర్వో ఎస్.భాస్కర్ రెడ్డి, డీఎమ్‌హెచ్‌ఓ పి.కోమలి, డీసీహెచ్‌ఎస్ ఎం.పద్మ, ఎస్‌ఈపీఆర్ కె.బాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మద్యం షాపులకు
12 దరఖాస్తులు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో నాలుగు మద్యం షాపులకు ఇప్పటి వరకు 12 దరఖాస్తు లు వచ్చినట్టు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి వై.శ్రీలత తెలిపారు. కడియం షాపునకు ఏడు, మండపేట రూరల్ మండలంలో షాపునకు ఐదు దరఖాస్తులు వచ్చాయన్నారు. బిక్కవోలు, కొవ్వూరు రూరల్ మండల షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని తెలి పారు. దరఖాస్తులను బుధవారం పరిశీలించి, ఈ నెల 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో లాటరీ తీస్తామన్నారు.


