గుర్తించడం లేదు
15 ఏళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్నాం. కాంట్రాక్ట్ పేరు చెప్పి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం లేదు. 2011 నుంచి కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏదో ఒకరోజు రెగ్యులరైజ్ చేస్తారని ఆశగా ఎదురు చూస్తే ఇప్పుడు చేయమంటున్నారు. ఇప్పుడు వేరే చోటకు వెళ్లి ఉద్యోగం చేసుకుందామన్నా వయసు పరిమితి దాటిపోయింది.
– స్వర్ణకుమారి, స్టాఫ్‌నర్సు,
జీజీహెచ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ
కాంట్రాక్టు ఉద్యోగులపై వివక్ష
కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతుందో అర్థం కావడం లేదు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కూడా లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో సొంత డబ్బులతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది మాతోటి సిబ్బంది సేవలందిస్తూ చనిపోయారు. – శిల్ప సౌందర్య, ల్యాబ్
టెక్నీషియన్, సీతానగరం పీహెచ్‌సీ
ఇప్పటికై నా స్పందించాలి
ప్రభుత్వం వైద్యులను మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తోంది. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారా మెడికల్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటున్నారు. అత్యవసరమై సెలవు తీసుకుంటే జీతంలో కోత విధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలి.
– సీహెచ్ లక్ష్మి, స్టాఫ్ నర్సు, మాచవరం పీహెచ్‌సీ
చాలీచాలని జీతం
చాలీచాలని జీతంతో సేవలందిస్తున్న మాకు సెలవులు, ఈహెచ్‌ఎస్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. సమస్యలన్నీ పరిష్కరించి పీఎఫ్, హెల్త్ బెనిఫిట్స్ కల్పించాలి. హెల్త్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– రత్నకుమారి, స్టాఫ్‌నర్సు,
మండపేట సీహెచ్‌సీ
● మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాల్సిందే
● వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్
ఉద్యోగుల డిమాండ్
● రాజమహేంద్రవరంలో ధర్నా
సాక్షి, రాజమహేంద్రవరం: ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా గుర్తింపు, తగిన వేతనం లభించడం లేదని, ఇప్పటికై నా ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారా మెడికల్ సిబ్బంది మంగళవారం సమ్మె బాట పట్టారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 400 మందికి పైగా సిబ్బంది రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట శిబిరం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడంతో కాంటాక్ట్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు. బుధవారం నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరించి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో సుమారు 600 మంది సేవలందిస్తున్నారని తెలిపారు. మరోవైపు వైద్య సేవలకు అంతరాయం లేకుండా రెగ్యులర్ ఉద్యోగులు సెలవులు తీసుకోవద్దని జీజీహెచ్ ఉన్నతాధికారులు ఆదేశించారు.
ప్రధాన డిమాండ్లు
● కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని అర్హులను రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి.
● భవిష్యత్తులో వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి.
● పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపి పరిష్కరించాలి.
● విధుల్లో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
● పరస్పర అవగాహనతో స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి. శాశ్వత ఉద్యోగులకు ఇచ్చినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు పెయిడ్ సిక్ లీవ్‌లు, ఈహెచ్‌ఎస్ కార్డులు అందజేయాలి.
బెనిఫిట్లు లేవు
పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సేవలందిస్తున్నా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే మమ్మల్ని ఉంచేసి శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. ఎటువంటి హెల్త్ బెనిఫిట్లు అందించడం లేదు. ప్రభుత్వానికి ఇప్పటికే 90 రోజులు గడువిచ్చినా డిమాండ్లు నెరవేర్చి, రెగ్యులరైజ్ చేయకపోవడంతోనే సమ్మెబాట పట్టాం. – ప్రియదర్శిని, స్టాఫ్‌నర్సు, తాడిమళ్ల పీహెచ్‌సీ
కూలీల కంటే దారుణం
మా కుటుంబాలకు ఏ పథకమూ వర్తించడం లేదు. తెల్లరేషన్ కార్డు, అమ్మ ఒడి, ఇతర పథకాలు పొందలేకపోతున్నాం. అలాగని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించడం లేదు. మా పరిస్థితి రోజువారీ కూలీల కంటే దారుణంగా తయారైంది. – అష్రఫ్ ఆలీ, ల్యాబ్ టెక్నీషియన్, పాలచర్ల పీహెచ్‌సీ


