● పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే
ఫిర్యాదు చేసే సదుపాయం
● ఆన్‌లైన్ ద్వారా
ఉన్నతాధికారుల పర్యవేక్షణ, కౌన్సెలింగ్
రాయవరం: ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులపై ఫిర్యాదు చేయడానికి బాధితులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం విషయం బయటపడితే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల గోప్యతను కాపాడుతూ, ఇంటి నుంచే నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పోక్సో ఈ–బాక్స్’ పేరుతో ఒక ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫిర్యాదు దారులకు పూర్తి రక్షణతో పాటు నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ
ఈ యాప్‌లో వచ్చే ఫిర్యాదులను ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. అధికారులు వాటిని పరిశీలించి విచారణ చేపడతారు. అనంతరం బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేస్తారు.
ఎన్‌సీపీసీఆర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఈ ఫిర్యాదులను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తారు. యాప్ ద్వారానే కాకుండా ఎన్‌సీపీసీఆర్ వెబ్‌సైట్ ద్వారా కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా కేవలం చట్టపరమైన సాయమే కాకుండా, లైంగిక వేధింపులకు గురై మానసిక క్షోభ అనుభవిస్తున్న చిన్నారులకు నిపణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. ఫిర్యాదు అందిన వెంటనే కేంద్ర స్థాయిలో ఉన్న బృందాలు స్థానిక పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సత్వర న్యాయం జరిగేలా చూస్తాయి.
వివరాలు గోప్యం
పోక్సో ఈ–బాక్స్ యాప్‌ను చిన్నారుల రక్షణకు సద్వినియోగం చేసుకోవాలి. బాధితులు తమకు జరిగిన అఘాయిత్యాలపై భయం లేకుండా యాప్‌లో లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.
– డి.సురేష్‌బాబు, ఎస్సై, రాయవరం
యాప్‌ను ఉపయోగించాలిలా
స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి పోక్సో ఈ–బాక్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ తెరవగానే కనిపించే ‘పోక్సో’ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో ఆట స్థలం, దుకాణం, రోడ్డు, పాఠశాల, ట్యూషన్, స్కూల్ బస్సు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరులు, ఇంటర్నెట్/ఫోన్ ద్వారా బ్లాక్ మెయిల్ ఇలా వివిధ రకాల వేధింపులను సూచించే చిత్రాలు (ఐకాన్స్) కనిపిస్తాయి. బాధితులకు ఎదురైన ఘటనకు సంబంధించిన చిత్రంపై క్లిక్ చేయాలి. అనంతరం బాధితుల పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, జరిగిన ఘటనను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.


