లోవలో అక్రమ టోల్‌ | - | Sakshi
Sakshi News home page

లోవలో అక్రమ టోల్‌

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

విచ్చలవిడిగా మూడు ముక్కలాట

భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న

నిర్వాహకులు

పట్టించుకోని అధికారులు

లోవ ప్రాంగణంలో బహిరంగంగానే నిర్వహిస్తున్న మూడు ముక్కలాట

తిరుగు ప్రయాణంలో స్టాపర్‌తో నిలిచిపోయిన వాహనాలు. రుసుములు వసూలు చేస్తున్న సిబ్బంది

తుని రూరల్‌: తలుపులమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులకు అంతకంటే ముందే టోల్‌గేట్‌లో నిలువు దోపిడీ ఎదురవుతోంది. టోల్‌గేటలో అక్రమ వసూళ్లకు గురవుతున్న భక్తులు లోవ ప్రాంగణంలో సాగుతున్న మూడు ముక్కలకు (కాయిన్లు) ఆకర్షితులై ఉన్న డబ్బులు జూదంలో కోల్పోయి లబోదిబో మంటున్నారు. కొంత కాలంగా అక్రమ వసూళ్లు, మూడు ముక్కలాట జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

టోల్‌గేటులో ఇలా

లోవ దేవస్థానం ఆధ్వర్యంలో టోల్‌గేటు నిర్వహణకు రెండేళ్ల కాలానికి టెండర్‌ ఖరారు చేసి కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఏడాదికి రూ.45 లక్షలు వరకు ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. మోటర్‌ సైకిల్‌కు ఒకసారి వెళ్లొచ్చేందుకు రూ.10, చిన్నకారు రూ.75 చొప్పున వసూలు చేయవచ్చు. కానీ మోటార్‌ సైకిల్‌కు రూ.20, చిన్నకారుకు రూ.వంద చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కాంట్రాక్టర్‌కు రూ.పదివేలు వరకు జరిమానా విధించేవారు. ఇప్పుడు అవేమీ లేకపోగా రుసుములు పట్టిక ధ్వంసం చేసి వ్యాలీడ్‌ ఫర్‌ వన్‌ ట్రిప్‌ అన్న బోర్డు అమర్చి దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే నిర్దేశిత టోల్‌గేటు వద్ద రుసుములు వసూలు చేయాల్సిన కాంట్రాక్ట్‌ సిబ్బంది ఆ ప్రాంతాన్ని విడిచి ఆర్చిగేటు వద్ద వసూళ్లు చేస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి.

జోరుగా మూడు ముక్కలాట

ఎన్నడూలేని విధంగా దేవస్థానం ప్రాంగణంలో మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. పేకముక్కలకు బదులు కాయిన్లు ఏర్పాటు చేసి కాయ్‌ రాజా కాయ్‌ అంటూ జూదం ఆడుతూ భక్తులను దోచుకుంటున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే తాము పోలీసులకు చెప్పామని, పోలీసులు సివిల్‌ డ్రస్‌లో వస్తే జూదగాళ్లు పారిపోతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు కల్పించుకుని నిలువుదోపిడీ నుంచి కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement