● వేతనాలు అందక పారిశుధ్య సిబ్బంది వెతలు
● రెండు నెలలుగా రూ.కోటి బకాయిలు
● పట్టించుకోని పద్మావతి కాంట్రాక్టు సంస్థ
అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య సిబ్బంది జీతాల సమస్య వీడడం లేదు. ఆ సిబ్బంది కాంట్రాక్టు నిర్వహించే పద్మావతి శానిటరీ, హౌస్ కీపింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో పని చేస్తున్న 350 మంది సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు ఇంకా అందలేదు. ఈ నెల పదో తేదీ వచ్చినప్పటికీ జీతాలు రాకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. వర్కర్ నుంచి సూపర్‌వైజర్ వరకు నెలకు రూ.9 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంటుంది. ఈపీఎఫ్ కటింగ్ పోగా రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంది. నెలకు రూ.80 లక్షలు శానిటరీ టెండర్ కాగా, రూ. 30 లక్షలు మెటీరియల్ తదితర ఖర్చులకు మినహాయించి, రూ.50 లక్షలు జీతాలు చెల్లిస్తున్నారు. ఇలా రెండు నెలలకు రూ.కోటి చెల్లించాల్సి ఉంది.
గత ప్రభుత్వంలో ఎక్కడి టెండర్ అక్కడే
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పారిశుధ్య పనులకు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానంలోనే టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడు ప్రముఖ దేవస్థానాలను ఒకే యూనిట్ గా శానిటరీ టెండర్లు నిర్వహించాలని 2024 ఆగష్టు 27న నిర్ణయించారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి పద్మావతి సంస్థ పారిశుధ్య పనుల టెండర్ దక్కించుకుంది. పారిశుధ్య పనులలో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతుతో పాటు ఏసీల నిర్వహణ, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. దీంతో కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు ఖరారైంది. అలాగే 50 ఏళ్లు దాటిన సుమారు 50 మందిని గత నవంబర్‌లో తొలగించారు. కాగా కూటమి నేతలు సిఫార్సు చేసిన 350 మందిని వయో పరిమితితో సంబంధం లేకుండా ఈ పనుల్లోకి తీసుకోవడం గమనార్హం.
సీఎంకు సన్నిహితుడికే టెండర్
రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలైన అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలలో పారిశుధ్య పనులను తిరుపతికి చెందిన పద్మావతి శానిటరీ, హౌస్ కీపింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ అధిపతి భాస్కరనాయుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు ఉంది.
బిల్లు పెట్టిన వెంటనే చెల్లిస్తాం
దేవస్థానంలో శానిటరీ పనులు నిర్వహిస్తున్న ‘పద్మావతి’ సంస్థ ప్రతి నెలా సిబ్బందికి ఈపీఎఫ్, తదితర చెల్లింపులు చేస్తూ ఆ రశీదులతో కాంట్రాక్ట్ బిల్లు అందచేస్తే వెంటనే నిధులు విడుదల చేస్తాం. సకాలంలో బిల్లు పెట్టాలని ఇప్పటికే వారిని ఆదేశించాం.
– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం


