పెరవలి: రబీలో ధాన్యాన్ని సేకరించటానికి అధికారులు సిద్ధమవుతుండగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వరి సాగు 2,19,831 ఎకరాల్లో చేపట్టగా 8.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అధికారులు వేసిన అంచనాలు అటుఇటుగా నిజం అయినా కొనుగోలు ఎంత చేస్తారనేది చెప్పకపోవటంతో రైతులు గందరగోళంలో పడ్డారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా ఆన్‌లైన్‌లో సైట్ ఓపెన్ కాకపోవడంతో రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రూ.2,389, కామన్ రకం రూ.2,369గా ప్రకటించింది. మిల్లర్లు తేమ శాతం ముసుగులో క్వింటాల్‌కు 15 కిలోల ధాన్యానికి సొమ్ము తగ్గించి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎకరాకు సగటున 50 బస్తాల దిగుబడి వస్తే సుమారు రూ.6 వేల వరకు నష్టపోవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
249 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 249 ఏర్పాటు చేశామని, 242 మిల్లులను ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ధాన్యం కొనుగోలు కొందరు మిల్లర్లకు అధిక మొత్తంలో, మరికొన్ని మిల్లులకు తక్కువ మొత్తంలో కేటాయిస్తున్నారని మిల్లర్లే బహిరంగంగా అంటున్నారు.
గంటల తరబడి నిరీక్షణ
మెట్ట ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతుండగా ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి, బస్తాల్లో పట్టి నిల్వ ఉంచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సైట్ ఓపెన్ కాకపోవటంతో రైతులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దీంతో విసుగెత్తిన రైతులు నేరుగా రైసు మిల్లులకు వెళ్లి ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు.
కళ్లాల్లో ధాన్యం
వాతావరణం బాగుండకపోవటంతో రైతులు పండిన ధాన్యాన్ని కళ్లాల్లోను, రాశులుగాను, బస్తాల్లో నిల్వ చేసుకుంటున్నారు. సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
సక్రమంగా కొనుగోలు చేస్తారా?
పండిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రబీలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలు తప్పి ధాన్యం దిగుబడులు అనూహ్యంగా రావడంతో సేకరణ లక్ష్యాన్ని 3.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. అయినా రైతుల వద్ద ధాన్యం మిగిలిపోయి అయినకాడికి అమ్ముకోవలసి వచ్చింది. ఈసారైనా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని పండిన ధాన్యం అంతా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం విఫలం
ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో విఫలం అయ్యింది. కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్లు చేశామంటున్నారు కానీ ఎక్కడా కొనడం లేదు.
– నంబూరి త్రిమూర్తిరాజు, రైతు, చిన కొండేపూడి
రోడ్డు పక్కనే ధాన్యం
ఐదెకరాలు సాగు చేశాను. సైట్ ఓపెన్ కాక రోడ్డు పక్కనే ధాన్యం బస్తాల్లో పట్టి ఉంచాను. ప్రభుత్వం చెప్పిన దానికి, వాస్తవానికి పొంతన లేదు.
– గెడ్డం వెంకట రామారావు, కౌలు రైతు, ముగ్గళ్ల
ఆన్‌లైన్‌లో సైట్ ఓపెన్ కాక..
సాగని సేకరణ
అయినకాడికి అమ్ముకుంటున్న రైతులు
తేమ శాతం ముసుగులో క్వింటాల్‌కు
15 కిలోల చొప్పున తరుగు
మిల్లర్ల దోపిడీతో ఎకరాకు సుమారు
రూ.6 వేలు నష్టపోతున్న వైనం


