ఆగని ఇసుక దుమారం | - | Sakshi
Sakshi News home page

ఆగని ఇసుక దుమారం

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన జనసేన,

కూటమి నేతలు

తాళ్లపూడి: కూటమి ప్రభుత్వంలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇసుక ర్యాంపుల నిర్వహణపై కూటమిలోని జనసేన, టీడీపీకి చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. మండలంలో ఇసుక ర్యాంపుల నిర్వహణ, అక్రమ రవాణాపై కూటమిలోని కొత్తవర్గం శుక్రవారం తాళ్లపూడి తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు చెవ్వురి రాము, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పెదపాటి కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ లక్ష్మి లావణ్యను కలిసి ఇసుక ర్యాంపుల్లో అక్రమాలను అరికట్టాలని కోరారు. మండలంలో నిర్వహిస్తున్న అన్ని ఇసుక రాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతున్నాయని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మూడవ రోజూ వైద్య ఉద్యోగుల నిరసన

అనపర్తి : ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడవ రోజు శుక్రవారం కూడా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్య ఉద్యోగులు తమ నిరసన కొనసాగించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస టైమ్‌ స్కేల్‌ అమలు చేయడంతో పాటు, 35 రోజుల సాధారణ సెలవులను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నూరు శాతం గ్రాస్‌ శాలరీ అమలు చేయడంతో పాటు, వారికి రెగ్యులరైజేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం స్పందించి, న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్టాఫ్‌ నర్సులు, కౌన్సిలర్‌ చైతన్యరాజు, రేడియోగ్రాఫర్‌ విజయకుమార్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ క్రాంతి, ఫార్మసిస్ట్‌ మీనా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement