ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ ఎస్.భవ్య కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ మీదుగా దేవీచౌక్ వరకూ ప్రదర్శన కొనసాగింది. డీఎస్పీ మాట్లాడుతూ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చన్నారు. సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది పీఎంపీ అసోసియేషన్ ద్వారా అన్ని మండలాల్లో అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల అధ్యక్షుడు అబ్దుల్ రహ్మాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 31
రూర్బన్ పంచాయతీలు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో పదివేల మందికి పైగా జనాభా, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా జిల్లాలోని 31 పంచాయతీలకు గుర్తింపు లభించింది. అలాగే గ్రేడ్ – 1 పంచాయతీలుగా 167, గ్రేడ్ – 2గా 75, గ్రేడ్–3గా 69 పంచాయతీలు ఆమోదం పొందాయి. రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ధవళేశ్వరం, రాజవోలు, బొమ్మూరు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్‌సిటి, కోలమూరు, కాతేరు, కడియం, వేమగిరి, కడియపులంక, రాజానగరం, దివాన్‌చెరువు, పాలచర్ల, చెల్లూరు, కేశవరం, ఏడిద, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, బలభద్రపురం, చాగల్లు, దేవరపల్లి, గోకవరం, గోపాలపురం, నల్లజర్ల, పోతవరం, ఖండవల్లి, పాలంగి, ఉండ్రాజవరం, వేలివెన్ను రూర్బన్ పంచాయతీలుగా మారాయి.
ఏప్రిల్ 25న పాలిసెట్
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్‌ను ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, హెల్ప్‌లైన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల మురళి అన్నారు. ఆ కళాశాల ఆవరణలో బుధవారం పాలిసెట్ పోస్టర్లను లెక్చరర్లతో కలిసి ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లోని 14 కేంద్రాల్లో సుమారు 8 వేల మంది విద్యార్థుల వరకూ పరీక్ష రాయనున్నారన్నారు. ఈ ఏడాది నుంచి నిడదవోలు, తుని ప్రాంతాల్లో కూడా కొత్తగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు తమ కళాశాలలో ఏప్రిల్ 2 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.
రెండో రోజూ కొనసాగిన ఏసీబీ తనిఖీలు
రాజమహేంద్రవరం సిటీ: అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారులు రెండో రోజు బుధవారం తనిఖీలు కొనసాగించారు. డీఎస్పీ కిశోర్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్, మరో 20 మంది సిబ్బందితో ఉదయం నుంచి రాత్రి వరకూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలకమైన డాక్యుమెంట్లతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోని అన్ని శాఖలను తమ అధీనంలోకి తీసుకున్నారు. సిటీ ప్లానర్ జీవీఎస్‌ఎన్ మూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సర్వేయర్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ తదితర అధికారులు, సిబ్బందికి చెందిన మొబైల్ ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. అవినీతికి ఆస్కారం ఉన్న 20 డాక్యుమెంట్లను గుర్తించినట్టు సమాచారం.


