● మాజీ ఎంపీ మార్గాని
భరత్‌రామ్ డిమాండ్
● బాధితులకు రూ.25 లక్షల
చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి
రాజమహేంద్రవరం సిటీ: కల్తీ పాల దుర్ఘటనపై నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని, ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో కల్తీపాల ఘటనతో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిలో నాటకాలు వేయడానికి టైం ఉంది కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్‌లకు కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే సమయం లేదని ధ్వజమెత్తారు. ఈ ఘటనను ప్రభుత్వం యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. బాధితుల శాంపిళ్లు నేషనల్ ఫోరెన్సిక్ లేబొరేటరీకి ఎందుకు పంపలేదో తెలియడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరపాలన్నారు. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా, గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా అన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదన్నారు. బాధితుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైందని, ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న మిల్క్ ప్రొక్యూర్ మెంట్ యాక్ట్ తీసుకొచ్చారని, ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. చిన్నారులు సైతం మృతువుతో పోరాడుతున్నారు. ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి వారాలు ఎందుకు పడుతోందో తెలియడం లేదన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందన్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత హెరిటేజ్ అడ్వర్‌టైజ్‌మెంట్లు విపరీతంగా పెంచిందన్నారు. ఈ ఘటనను కూడా వ్యాపారం కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటా కల్తీ రాజ్యమేలుతోందన్నారు. చంద్రబాబు హయాంలో తిరుమల లడ్డూకు సంబంధించి ఘీ ఫ్లేవర్ ఎన్ హ్యాన్సర్స్ కొన్నారు అదీ కల్తీయేనన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం అందించడం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తనిఖీల గురించి ప్రశ్నిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాకు స్టాఫ్ లేరని చెప్పడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నేతలు సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, వాసంశెట్టి గంగాధర్, తిరగాటి దుర్గారావు, రొక్కం త్రినాఽథ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


