వై.రామవరం: మండలంలోని చవిటిదిబ్బలు గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ సిబ్బంది గాయపడ్డారు. వై.రామవరం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పొత్తూరి సత్యనారాయణరెడ్డి, పి.యర్రగొండ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పల్లాల విజయకుమారి ద్విచక్ర వాహనంపై విధుల నిర్వహణకు వై.రామవరం వైపు వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో రోడ్దు మీద పడిపోయి గాయపడ్డారు. అయినా వీరిని పట్టించుకోకుండా కారు వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు చవిటిదిబ్బలు పీహెచ్‌సీకి తరలించగా, ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వై.రామవరం సీహెచ్‌సీకు తీసుకువెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై ఎస్.పృథ్వీ యాదర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి కారకుడైన తహసీల్దార్ కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులతో పాటూ సచివాలయాల సిబ్బంది యూనియన్ నేతలు కోరారు.


