● అక్రమ కట్టడాల నేపథ్యంలో
నగర పాలక సంస్థలో విస్తృత తనిఖీలు
● సుమారు 12 గంటల పాటు నిర్వహణ
రాజమహేంద్రవరం సిటీ: నగర పరిధిలో అడ్డగోలు నిర్మాణాలు, అక్రమ కట్టడాలకు అనుమతులు, పట్టణ ప్రణాళికా విభాగం అవినీతి భాగోతాలపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి ఆదేశాల మేరకు డీఎస్సీ కిశోర్‌కుమార్ ఇన్‌స్పెక్టర్లు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్ మరో 20 మంది సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 8.30 నిముషాల వరకూ విస్తృతంగా తనిఖీ చేపట్టారు. నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. నగరంలో భవన నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, దరఖాస్తులు పెండింగ్‌కు గల కారణాలను అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఎన్ని మంజూరు చేశారు. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే విషయాలను పరిశీలించారు. సిటీ ప్లానర్ జీవీఎస్‌ఎన్ మూర్తి కార్యాలయంలో కంప్యూటర్, వివిధ స్థాయి అధికారుల ఫైల్స్ పరిశీలించి కీలకమైన డాక్యమెంట్స్‌ను స్వాధీన పరుచుకున్నట్లు సమాచారం. నగరంలో అత్యధిక అక్రమ కట్టడాల నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్‌లోని వివిధ విభాగాల్లో అవినీతి చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు వివిధ వేదికల ద్వారా ఏసీబీ దృష్టికి వెళ్లడం, ప్రజల నుంచి, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు, పలు కథనాలు రావడంతో ఏసీబీ అధికార యంత్రాంగం రంగంలోకి దిగి అవినీతిపై అకస్మిక తనిఖీలు చేపట్టింది. భవన నిర్మాణాల అనుమతుల్లో నిబంధనల అతిక్రమణలు ఉన్నాయా అనే విషయాన్ని సైతం అధికారులు పరిశీలించారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ కిశోర్‌కుమార్‌ను వివరణ కోరగా తనిఖీలు నిర్వహించి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.


