ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ ఉత్తమ క్రీడాకారుడిగా సమంత్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ ఉత్తమ క్రీడాకారుడిగా సమంత్‌కుమార్‌

Mar 11 2026 7:50 AM | Updated on Mar 11 2026 7:50 AM

దేవరపల్లి: రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన దేవరపల్లి అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్‌ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి కె.సమంత్‌కుమార్‌ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. సమంత్‌కుమార్‌కు నిర్వాహకులు రూ.35 వేల విలువ గల ఎలక్ట్రికల్‌ సైకిల్‌ను బహుమతిగా అందజేసి సత్కరించారు. పోటీల్లో జిల్లా నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా సమంత్‌కుమార్‌ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికై నట్టు పీడీ ఓరుగుంటి రామకృష్ణంరాజు తెలిపారు.

జాతీయ విద్యా విధానం

అమలుకు కృషి చేయాలి

‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ

రాజానగరం: జాతీయ విద్యా విధానం 2020తోపాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల నిర్మాణాత్మక అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ సెమినార్‌ హాలులో గోదావరి జిల్లాల్లోని అనుబంధ డిగ్రీ కళాశాలల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్స్‌, మెంబర్స్‌తో మంగళవారం సమావేశమయ్యారు. కోర్సుల నిర్మాణం, సిలబస్‌ పునర్నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని యూజీ ప్రొగ్రామ్‌లకు సాధారణ ఫ్రేమ్‌ వర్కు నియమాలు, ఉత్తీర్ణతా ప్రమాణాలను నియంత్రించే ‘యూనివర్సిటీ కామన్‌ కోర్‌ ఫ్రేమ్‌ వర్కు’ను సృష్టించడం, అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ ఫ్రేమ్‌ వర్కు ప్రకారం క్రెడిట్‌ల నిల్వ, బదిలీ, విముక్తికి సంబంధించి ప్రత్యేక నియమాలను రూపొందించాలని సూచించారు. పరీక్ష నిబంధనల పునర్నిర్మాణం, గ్రేడింగ్‌, భాషలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, భారతీయ జ్ఞాన వ్యవస్థలు వంటి సాధారణ పత్రాల పునర్నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. డిగ్రీ కోర్సులకు సంబంధించి సిలబస్‌ తయారీ, మోడల్‌ పరీక్షా పత్రాలు వంటి అంశాలపై చర్చించారు.

తెలుగు వర్సిటీకి వేటూరి సాహిత్య సంపుటాలు

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రముఖ సినీ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్య సంపుటాలను బహూకరించారని ఉపాధ్యక్షుడు ఆచార్య డి.మునిరత్నంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ పాత్రికేయులు, సినీగేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్యాన్ని ఆరు సంపుటాలు–ఎనిమిది గ్రంథాలుగా అమెరికాలోని వేటూరి సాహిత్యభిమాన సమితి వారు 2026 జనవరిలో తొలిసారిగా ప్రచురించారన్నారు. దొరకునా ఇటువంటి సేవ(వాల్యూమ్‌–1), మానసవీణా మధుగీతం(వాల్యూమ్‌–2), నవమి నాటి వెన్నెల(వాల్యూమ్‌–3),ఎడారికోయిల(వాల్యూమ్‌–4), ఝమ్మంది నాదం(వాల్యూమ్‌–5), ఎరక్కపోయి వచ్చాను (వాల్యూమ్‌–6) గ్రంథాలతో పాటు గతంలో ప్రచురించిన వేటూరి సుందర రామమూర్తి పుస్తకాలు‘కొమ్మకొమ్మకోసన్నాయి’, ‘రాబిన్‌హుడ్‌’,‘జీవనరాగం’‘సిరికాకొలనుచిన్నది’ సంపుటాలను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులో ఉండేవిధంగా సుందరరామమూర్తి కుమారుడు వేటూరి రవిప్రకాష్‌ ఆచార్య మునిరత్నంనాయుడుకు మంగళవారం అందజేశారు. రాజమహేంద్రవరం సాహిత్యపీఠంలో డాక్టర్‌ పొన్నాలీలావతి పర్యవేక్షణలో జయంతి చక్రవర్తి అనే విద్యార్థి వేటూరి సుందరరామమూర్తి పాటలు – సాహిత్యపు విలువలు అనే అంశంపై పీహెచ్‌డీ కోసం పరిశోధన చేసి పట్టా అందుకోవడం విశేషమని ఆచార్య మునిరత్నంనాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement