రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. పార్టీకి చెందిన ముఖ్యనేతలు పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. వైఎస్సార్ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ఎదుర్కొందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు సంక్షేమాభివృద్ధికి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ప్రజలను వంచించిందన్నారు.


