భక్తజన సాగరం
● వైభవంగా చొల్లంగి తీర్థాలు
● కిక్కిరిసిన ఆలయాలు
● అడుగడుగునా ఆధ్యాత్మిక పరవళ్లు
కరప: సాగర తీరం భక్తజనంతో ఉప్పొంగింది.. ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కింది.. చొల్లంగి అమావాస్య సందర్భంగా కరప మండలం ఉప్పలంక, కాట్రేనికోన మండలం పల్లం పంచాయతీ బ్రహ్మసమేథ్యం, తాళ్లరేవులో తీర్థ మహోత్సవాలు అంబరాన్నంటాయి. ఉప్పలంక శివారు మొండి వద్ద సముద్ర తీరాన చొల్లంగి తీర్థం కనుల పండువగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సాగర సంగమ క్షేత్రంలో పుణ్య స్నానాలు చేశారు. పుష్య అమావాస్య సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొండిలోని బాలా త్రిపురసుందరి సమేత సంగమేశ్వర స్వామి, కాలభైరవస్వామి, సీతారాములు, ఆంజనేయస్వామి వార్లను, చొల్లంగిలోని రాజరాజేశ్వరీదేవి సమేత సోమేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ముందుగా సంగమేశ్వరస్వామి ఆలయంలో వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి కార్తీక్ నాయకర్‌తో అర్చకుడు దొంతుకుర్తి వెంకటకృష్ణశాస్త్రి ప్రత్యేక పూజలు చేయించారు. చొల్లంగి సోమేశ్వరస్వామి ఆలయంలో అనువంశిక అర్చకులు వెలవపల్లి భవానీశంకరశర్మ, సత్యచిరంజీవిలు స్వామివార్లకు వేకుజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరప పరిసర మండలాల నుంచి వీరభద్రుని గద్దె నుంచి ప్రభలను, గరగలను తలపై ఎత్తుకుని వచ్చి భక్తిప్రపత్తులతో స్నానాలు చేశారు. పలు గ్రామాల నుంచి అప్పన్నెద్దులను తోలుకుని వచ్చి సముద్ర స్నానం చేయించి సోమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సాగర సంగమమైన మొండి వద్ద మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ ఇక్కడి ఆలయాన్ని నిర్మించారు. వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ మల్లాడి కార్తీక్ నాయక్, దేవదాయ శాఖ ఏసీ చాగంటి సురేష్‌నాయుడులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో కరప, కోరంగి ఎస్‌ఐలు టి.సునీత, సత్యనారాయణరెడ్డి, ఏఎస్‌ఐ వి.సూరిబాబులు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీఓ జె.శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ ఎస్‌వీ శ్రీనివాసరావు, మండల సచివాలయాల అధికారి కర్రి శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి ఎం.భవానీ ఇతర పంచాయతీ కార్యదర్శులతో కలసి సమాచార కేంద్రం వద్ద ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 90 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటంతో దొంగతనాలు జోరుగా జరిగాయి.
బ్రహ్మసమేథ్యంలో..
కాట్రేనికోన: మండలంలోని పల్లం పంచాయతీ బ్రహ్మసమేథ్యంలో చొల్లంగి తీర్థానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేకువ జామునే సముద్ర స్నానం ఆచరించిన భక్తులు కాలభైరవస్వామి, పార్వతీ సమేత బ్రహ్మేశ్వరస్వాములను దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులు సముద్ర గర్భం నుంచి ఉదయిస్తున్న సూర్యుడిని దర్శించుకుని సముద్ర స్నానం చేశారు. సంతానం కోసం మహిళలు శనివారం రాత్రి సముద్ర స్నానం చేసి స్వామి పాదముద్ర చుట్టూ నిద్రలోకి జారుకున్నారు. స్వామి కరుణతో సంతానం పొందిన భక్తులు బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి కొబ్బరి మొక్కలు, అరటి గెలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అన్నసమారాధన చేసింది. చిర్రయానంలో కేశనకుర్రుకు చెందిన దివంగత గాదిరాజు వెంకట కృష్ణంరాజు జ్ఞాపకార్థం శ్రీసత్య ధనశ్రీ హేచరీ అధినేత చిన సుబ్బరాజు, వెంట లక్ష్మి దంపతులచే నిర్మించిన కాలభైరవ స్వామి ఆలయంలోనూ చొల్లంగి అమావాస్య పూజలు నిర్వహించారు.
స్తంభించిన ట్రాఫిక్
యానాం వైపు నుంచి వచ్చే వాహనాలను పటవల నుంచి గొర్రిపూడి మీదుగా మళ్లించకుండా ఆ వాహనాలకు కూడా గురజనాపల్లి, నడకుదురు మీదుగా వెళ్లేందుకు అనుమతించడంతో ఇబ్బంది వచ్చింది. సింగిల్ రోడ్డులో ఇరువైపులా వచ్చే వాహనాల రద్దీతో ప్రతి అరగంటకు ట్రాఫిక్ స్తంభించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు.
భక్తజన సాగరం


