‘ధర్మమే యుధిష్ఠిరుని నిజమైన పరాక్రమం’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అస్త్రశస్త్రాలు, కత్తులు మాత్రమే కావని, ధర్మమే యుధిష్ఠిరుని నిజమైన పరాక్రమమని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనంలో భాగంగా స్థానిక హిందూ సమాజంలో శుక్రవారం ఆయన సైంధవ వధ అనంతరం కురుపాండవ స్పందనలను వివరించారు. ‘‘తన వద్దకు వచ్చిన కృష్ణార్జునులను చూసి ధర్మరాజు ‘కృష్ణా! నీ కోపాగ్నితోనే మా శత్రువులు దగ్ధమయ్యార’ని అంటాడు. అటు కౌరవ శిబిరంలో ద్రోణాచార్యులను దుర్యోధనుడు పరుషమైన మాటలతో నిందిస్తాడు. ‘నేను మిత్రులని భావించిన వారే మోహంతో, ధనాన్ని ఆశించి, పాప దృష్టితో, కుటిలంగా యుద్ధం చేస్తున్నార’ని ఎత్తిపొడుస్తాడు. ద్రోణుడు తీవ్ర స్వరంతో ‘ఈ యుద్ధం జరగకపోయి ఉంటే, నీవు తీవ్రమైన నరక బాధలకు గురై ఉండేవాడివి. ఈ యుద్ధంలో వీరమరణం సంభవిస్తే, నీవు పాపాల నుంచి విముక్తుడవు అవుతావ’ని అంటాడు. ‘నేను సైంధవ వధకు వస్తున్న అర్జునుడిని నివారించలేకపోయాను. కానీ, నీవు నమ్ముకున్న కర్ణుడు, ఇతర వీరులు అశ్వత్థామ, కృపాచార్యుడు, శల్యుడు కూడా నివారించలేకపోయారు’ అని అంటాడు. తరువాత కర్ణుడి వద్దకు దుర్యోధనుడు వెళ్లి ‘అర్జునుడి మీద ప్రేమతో అతడిని ఆచార్యుడు వధించడం లేదు. ఇక నీవు విజృంభించాల’ని కోరుతాడు. ‘దైవమే బలీయమైనది. మనం పాండవులకు విషం పెట్టినా, లక్క ఇంటిని దహనం చేసినా, మాయా ద్యూతంలో అడవులకు పంపినా వారు దూసుకువస్తున్నారు. దైవం మనకు అనుకూలంగా లేదన్నది స్పష్టం. మన పురాతన కర్మలే మన పాలిట శాపాలు. మనం నిదురిస్తున్నా, ఆ కర్మలు మేల్కొని మనకు ఫలితాలిస్తూంటాయి’ అని కర్ణుడు చెబుతాడు. అనంతరం ఇరుపక్షాల మధ్య సంకుల సమరం జరిగింది. చెలరేగిపోతున్న ఘటోత్కచుడిపై ఇంద్రుడు తనకిచ్చిన శక్తిని కర్ణుడు ప్రయోగించి, వధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు ఆనందభరితుడవుతాడు. ‘ఇక కర్ణుడు చచ్చినట్టే. శక్తి ఆయుధాన్ని వ్యయం చేసుకున్నాడు. ఎటు చూసినా, పాండవులకే లాభం. కర్ణుడిని ఘటోత్కచుడు సంహరించినా పాండవులకే లాభం. ఘటోత్కచుడిని కర్ణుడు చంపి, శక్తి ఆయుధాన్ని వ్యర్థం చేసుకున్నా పాండవులకే లాభం’ అని అన్నాడు. ఉభయ పక్షాలూ కొంత విశ్రమించిన తరువాత తిరిగి సంకుల సమరం ప్రారంభమైంది’’ అని సామవేదం వివరించారు. తిరిగి ద్రోణుడిని దుర్యోధనుడు పరుషమైన మాటలతో నిందిస్తాడని చెప్పారు. ‘నీకోసం నీచమైన యుద్ధానికి కూడా సిద్ధమవుతాన’ని ప్రత్యుత్తరమిచ్చిన ద్రోణుడు, భయంకర యుద్ధానికి ఉద్యుక్తుడవుతాడని, అస్త్రవిద్య తెలియని వారితో కూడా పోరు సాగించాలని నిర్ణయించుకుంటాడని అన్నారు.


