అమ్మవార్లను ఆకట్టుకునేలా..
రాయవరం: దేవుడిపై ఉన్న భక్తిని పలువురు వివిధ రకాలుగా ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగా లొల్ల గ్రామానికి చెందిన సుతాపల్లి శిరీష వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. చీరపై అష్టోత్తరం, గోవింద నామాలను రాసి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించారు. ఈ చీరను అమ్మవార్లకు అలంకరించేందుకు వినియోగించాలన్నారు. ఇప్పటి వరకు కాకినాడలోని కన్యకా పరమేశ్వరి, పిఠాపురంలోని పురూహుతికా అమ్మవారు, మండపేటలోని కన్యకా పరమేశ్వరి, లొల్లలోని శివాలయం, కాకినాడలో శ్రీపీఠం.. ఇలా తొమ్మిది ఆలయాల్లో అమ్మవార్లకు లలితా సహస్ర నామాలు రాసిన చీర్లను సమర్పించినట్లు తెలిపారు. రాయవరంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రెండు చీరలు, శ్రీవారికి పంచెను బహూకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట రమణ, స్థానిక నేతలు పీఎస్‌ఆర్, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంతెన అచ్యుత రామరాజు తదితరులు అభినందించారు.


