జనసేన నాయకుడి దాడి కేసుపై విచారణ
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడి, కుల దూషణకు పాల్పడిన జనసేన నాయకుడిపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మంగళవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న జరిగిన శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాలపర్తి భవ్యశ్రీ ఇక్కడ మెట్లపై నుంచి పడి మృతి చెందింది. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజోలు నియోజకవర్గ బహుజన సమాజ్‌వాది పార్టీ ఇన్‌చార్జి ఆకుమర్తి భూషణం వచ్చారు. అక్కడ వారిపై జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్ద నేరస్థలాన్ని, ఫిర్యాదు దారుడు, కేసులో కొందరు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.


