అంతర్వేది ఉత్సవాలకు సమన్వయంతో ఏర్పాట్లు
అమలాపురం రూరల్: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి, దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులతో మూడో విడత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య కల్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల తాకిడి రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్, పార్కింగ్, శానిటేషన్, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. జనవరి 28న కల్యాణోత్సవం, 29న రథోత్సవం, ఫిబ్రవరి 1న చక్రస్నానం, ఫిబ్రవరి 2న తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్ విభాగం లైటింగ్, బారికేడ్ల ఏర్పాట్లు చేయాలని, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆర్‌అండ్‌బీ శాఖ బస్సులు అంతర్వేది వరకూ చేరుకునేలా రహదారిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రత కోసం బీచ్, దేవాలయం వద్ద రాష్ట్ర విపత్తుల స్పందన దళాలను నియమించాలన్నారు. మూడు క్యూలు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా, స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్నారు. జనవరి 26 నుంచి ఐదు రోజుల పాటు ఆలయానికి సమీప ప్రాంతాల్లో మద్యం షాపులకు సెలవు ప్రకటించాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఉత్సవాలకు 1,500 మంది పోలీస్ సిబ్బందిని నియమించి శాంతి భద్రతలకు ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. ఆర్డీఓ కె.మాధవి మాట్లాడుతూ అంతర్వేది ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అన్ని శాఖలు సమన్వయంతో సాగాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఆర్డీఓలు పి.శ్రీకర్ డి.అఖిల, డీఎస్పీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.


