ఒకే వేదికపైకి వక్క రైతులు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని వక్క రైతులు, వ్యాపారులు ఒకే వేదికపైకి వస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 5న మండపేట రూరల్ మండలం ద్వారపూడి సమీపంలో వేములపల్లిలోని భవాని గార్డెన్స్‌లో సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వక్క ఆదర్శ రైతులు దొరయ్యచౌదరి, ఉప్పలపాటి చక్రపాణిలు సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల్లోని వక్క సాగు, విలువ జోడింపు, మార్కెటింగ్‌పై రైతులు – వ్యాపారుల సమ్మేళనం, ఎఫ్‌పీవో ఏర్పాటుపై చర్చించడంతో పాటు పుస్తకావిష్కరణ ఉంటుందన్నారు. కర్ణాటక రాష్ట్రం వక్క సాగుకు పెట్టింది పేరన్నారు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా వక్క సాగు బాగానే ఉందని, అక్కడ ప్రోత్సాహం కూడా అందుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా, విశాఖ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం తదితర జిల్లాల్లో వక్క సాగు అవుతోందన్నారు. కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర్ పంటగా సాగు చేస్తున్నామని దొరయ్య చౌదరి, చక్రపాణి చెప్పారు. ఎకరానికి మూడు, నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, ఇందులో రూ.లక్ష వరకూ మిగిలే అవకాశం ఉందని చెప్పారు. విత్తనం వేసిన ఐదారేళ్ల తర్వాత పంట చేతికి వస్తుందని, దాదాపు 30 ఏళ్లకు పైగా పంట ప్రతి ఏటా చేతికి వస్తుందని తెలిపారు. ఒక రకం విత్తనం అయితే ఆగస్టు నుంచి జనవరి వరకూ, మరో విత్తనం జనవరి నుంచి ఏప్రిల్ వరకు దిగుబడి వస్తుందని అన్నారు. అయితే మన రాష్ట్రంలో వక్క సాగుకు ప్రోత్సాహం, రాయితీలు వంటివి లేవని దొరయ్య చౌదరి, చక్రపాణి అన్నారు. మార్కెటింగ్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామన్నారు. అందుకే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు, అందరినీ సంఘటితం చేస్తున్నామన్నారు. కాసర్ గడ్ సీపీసీ ఆర్‌ఐ పూర్వ డైరెక్టర్ పి.చౌడప్ప, ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్ అండ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి చిరంజీవ్ చౌదరి దీనికి హాజరై సూచనలు చేస్తారని వారు చెప్పారు. ఈ అవకాశాన్ని వక్క సాగు, ఔత్సాహిక రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో టి.బాలాజీకుమార్, సీహెచ్ కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు.
ఫ వచ్చే నెల 5న వేములపల్లిలో సదస్సు
ఫ ఆదర్శ రైతులు
దొరయ్యచౌదరి, చక్రపాణి వెల్లడి


