ముక్కోటికి ముస్తాబైన ‘వాడపల్లి’
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ముక్కోటి ఏకాదశికి సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయాన్ని రంగు రంగుల వుష్పాలు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. దీనితో క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారి పూజాది కై ంకర్యాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించనున్నారు. ఆలయ సంప్రదాయం అనుసరించి తొలుత ప్రముఖులకు స్వామి దర్శనం అనంతరం భక్తులకు కల్పించనున్నారు. రాత్రి 7 గంటల వరకూ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం అదనపు ఏర్పాట్లు చేసినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే మించి భక్తులు తరలి వస్తారనే అంచనాతో అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రతా పరమైన చర్యలు చేపట్టామన్నారు. 400 మంది సేవకులను నియమించామన్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులందరికీ తీర్థ, ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం నిరంతరాయంగా అందిస్తామన్నామన్నారు.
వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు


