కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌ | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌

Dec 30 2025 7:40 AM | Updated on Dec 30 2025 7:40 AM

కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌

కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌

నల్లజర్ల: వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని, దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్‌ సీపీ నాయకులు హెచ్చరించారు. నల్లజర్లలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌లు సోమవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలిచ్చారని, రప్పారప్పా అన్నారని ఆరోపిస్తూ స్థానిక కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా.. వారిని పోలీసులు అరెస్టు చేసి, నడిరోడ్డుపై నడిపించిన తీరుపై మండిపడ్డారు.

చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని, వ్యవస్ధలు దిగజారుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. ఇటువంటి చర్యలతో న్యాయ వ్యవస్థ బతుకుతుందా అని ప్రశ్నించారు. జంతుబలిని సాకుగా చూపుతున్నారని, నిజానికి ఫ్లెక్సీల ముందు జంతుబలులు, రక్తతర్పణాల సంసృతికి తెర లేపిందే టీడీపీ అని చెప్పారు. గతంలో టీడీపీ కార్యకర్తలు ఇటువంటి పని చేసినప్పుడు ఏ చర్యలూ తీసుకోని ప్రభుత్వం.. ఇప్పుడే కొత్తగా చట్టం తెచ్చినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద పదుల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి, రక్తతర్పణం చేశారని గుర్తు చేశారు.

జక్కంపూడి రాజా మాట్లాడుతూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు గుండాగిరి చేస్తే సహించేది లేదన్నారు. తూర్పు చోడవరంలో కార్యకర్తలు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్ట పరిధిలో కేసులు పెట్టి, అరెస్టు చేసి, కోర్టుకు పంపాలని, అంతే కానీ వారిపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి దేశ ద్రోహులన్నట్టుగా నడిబజార్లో నడిపించి తీసుకువెళ్తారా అని ప్రశ్నించారు. అలా తీసుకెళ్లాలని ఎక్కడ రాసి ఉందో చెప్పాలన్నారు. హోం మంత్రి అనిత వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్‌ డిగ్రీకి పాల్పడిన పోలీసు అధికారులకు రాబోయే రోజులలో ఫోర్త్‌ డిగ్రీ తప్పదని హెచ్చరించారు.

మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత మాట్లాడుతూ, జగన్‌ జన్మదిన వేడుకలు, కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం కావడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, జగన్‌ కటౌట్‌ చూస్తేనే ఆ పార్టీ శ్రేణులకు వణుకు పుడుతోందని అన్నారు. ఒక సినీ డైలాగ్‌ను చిన్న పిల్లలు ఫ్లెక్సీపై రాయడాన్ని సాకుగా చూపి, మూడు గ్రామాల్లోని కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా.. వారిని అక్రమంగా నిర్బంధించి, కొట్టి హింసించారని అన్నారు. తద్వారా స్థానిక ఎమ్మెల్యే పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలు తట్టుకుని నిలబడుతున్నారని, ఎంత ప్రయత్నించినా తమకు లొంగని వారందరిపై ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు పెట్టి, తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను డైవర్ట్‌ చేయడానికే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను, నాయకులను బలి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంత్రిభద్రతలున్నాయా అని ఆమె ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టిన వారు ఎదురు ప్రశ్నిస్తే గంజాయి కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీసులు నడుస్తున్నారని, వారు ప్రజల పక్షాన స్వేచ్ఛగా విధులు నిర్వహించాలని, ఎవరికో బానిసలుగా, తొత్తులుగా పని చేయడం సరి కాదని హితవు పలికారు. అన్యాయానికి గురైన కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ మండల శాఖ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మూడు మండలాల అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి, కూచిపూడి సతీష్‌, ప్రతాపనేని వాసుబాబు, నాయకులు బంక అప్పారావు, సాలి వేణు, ముప్పిడి వెంకటరత్నం, తాడిగడప శ్రీనివాసరావు, సయ్యద్‌ మునాఫ్‌, యువరాజు, చిన్నీ నాగూ యాదవ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనార్దనరావు పాల్గొన్నారు.

‘జై జగన్‌’ అన్నా వేధిస్తారా?

అక్రమ అరెస్టులే కాకుండా

నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్తారా?

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే

మూల్యం తప్పదు

వైఎస్సార్‌ సీపీ నేతల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement