పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 30 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 30 ఫిర్యాదులు చేశారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.
జాతీయ త్రోబాల్ పోటీకి ఎంపిక
తాళ్లపూడి: మండలంలోని ప్రక్కిలంక గ్రామానికి చెందిన యువకుడు ప్రేముల ఫణిభూషణ్ 47వ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. సామాన్య దళిత కుటుంబానికి చెందిన రమేష్ అబీదా దంపతుల కుమారుడైన ఫణిభూషణ్ తాళ్లపూడి పరసా పద్మ రాజారావు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివాడు. ప్రస్తుతం గుంటూరు ఏపీఆర్‌డీసీ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. క్రీడలపై ఆసక్తితో త్రోబాల్‌లో నైపుణ్యం సాధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అదృష్టం దక్కించుకున్నాడు. కోచ్ టీఎస్‌ఎన్ కుమార్ తనకు మంచి శిక్షణ ఇస్తున్నారని ఫణిభూషణ్ చెప్పాడు. బుధవారం జరిగే తుది పోటీల్లో అర్హత పొందడానికి జరిగే లీగ్ మ్యాచుల్లో ప్రస్తుతం ఆడుతున్న అతడు విజయం సాధించాలని మండలంలోని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
యాగశాల పక్కన
మెట్లదారి విస్తరణ
అన్నవరం దేవస్థానం చైర్మన్ ఆదేశం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని యాగశాల పక్క నుంచి దిగువకు వెళ్లేందుకు ఉన్న మెట్లను మరింత వెడల్పుగా విస్తరించాలని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మెట్ల దారిని సోమవారం ఆయన పరిశీలించారు. కార్తిక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సత్యదేవుని దర్శనానంతరం వారు దిగేందుకు తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లు మాత్రమే సరిపోవని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు రావిచెట్టు పక్క నుంచి యాగశాల వద్దకు చేరుకునేలా అదనంగా మెట్లు నిర్మించారు. అక్కడి నుంచి రామాలయ ప్రాంగణంలోకి వెళ్లడం సులువవుతుందని ఆయన భావించారు. అయితే ఈ మెట్లు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో సరిపోవడం లేదు. గత కార్తిక మాసంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తుల తోపులాట జరిగింది. దీంతో ఈ మెట్లను మరో 10 అడుగుల వెడల్పున విస్తరించాలని చైర్మన్ ఆదేశించారు. అయితే, దీనివలన యాగశాల దక్షిణం వైపు మెట్లు సగం వరకూ పోయే అవకాశముంది. ఈ విషయమై సిద్ధాంతితో మాట్లాడగా.. దక్షిణం వైపు మెట్లు సగం తొలగించి, వాటికి బదులు ఎల్ ఆకారంలో తూర్పునకు మెట్లు నిర్మించి, వాటిని మిగిలిన వాటికి అనుసంధానం చేయాల్సిందిగా సూచించారని ఈఈ రామకృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ మెట్ల వెడల్పునకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవనున్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీలో
జిల్లా జయకేతనం
సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రారష్ట్‌ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపింయన్‌షిఫ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 30 ఫిర్యాదులు
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 30 ఫిర్యాదులు


