రెవెన్యూ క్లినిక్‌తో అర్జీలకు రియల్ టైమ్ పరిష్కారం
పీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)తో పాటు రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల రెవెన్యూ సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లో సంబంధిత అధికారులందరూ ఉండి సమస్యలు పరిష్కరించేలా ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక తొలిసారి నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీల్లో మూడు రెవెన్యూ ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించామని తెలిపారు. మిగిలిన వాటికి సంబంధించి సమస్య ఏ స్థాయిలో ఉందో గుర్తించి, తగిన ఎండార్స్‌మెంట్ జారీ చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే ఈ క్లినిక్ ప్రధాన ఉద్దేశమన్నారు. దేవదాయ భూములకు ప్రాపర్టీ రిజిస్టర్‌లో తప్పనిసరిగా 1బీ రికార్డులు వచ్చేలా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రికార్డుల సవరణలను సకాలంలో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించి, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లూ లేకుండా ఆర్‌డీఓలు, తహసీల్దార్లు పాసు పుస్తకాల పంపిణీ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో 214, రెవెన్యూ క్లినిక్‌లో 103 చొప్పున అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్‌ఓ టి.సీతారామ్మూర్తి, ఆర్‌డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సర్వే అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, 19 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


