విద్యారంగం.. గడ్డుకాలం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగం.. గడ్డుకాలం

Dec 29 2025 7:58 AM | Updated on Dec 29 2025 7:58 AM

విద్య

విద్యారంగం.. గడ్డుకాలం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై శీతకన్ను

‘తల్లికి వందనం’లో కోతలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం

గురువులకిచ్చిన హామీలు గాలికి..

రాజమహేంద్రవరం రూరల్‌/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నేడు సర్కారీ పాఠశాలల అభివృద్ధికి కా నరాని చేయూత.. ప్రభుత్వ చదువులకు కరవవుతున్న ప్రోత్సాహం.. విద్యారంగంలో సంక్షేమానికీ దాదాపు తిలోదకాలు ఇస్తున్న ధోరణి.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై విపరీతమైన బోధనేతర భారం.. పదో తరగతి పరీక్షల్లో 87.99 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఆరో స్థానం సాధించడం మినహా.. ఇతరత్రా అన్ని రూపాల్లోనూ ప్రభుత్వ విద్యారంగం ఈ ఏడాది గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

తల్లికి ‘వంచన’

పేదింటి పిల్లలను బడికి పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం పేరును ‘తల్లికి వందనం’గా మార్చింది. ప్రతి ఇంట్లోను చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించింది. తీరా చూస్తే తొలి ఏడాది ఈ సాయాన్ని ఎగ్గొట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ ఏడాది ఈ పథకాన్ని అమలు చేసినా.. లబ్ధిదారుల్లో.. వారికిచ్చే సాయంలో భారీగా కోత పెట్టారు. జిల్లాలో 1,88,220 మంది విద్యార్థులుండగా, అధికారుల లెక్కల ప్రకారం 1,22,799 మంది తల్లుల ఖాతాల్లో రూ.240 కోట్లు జమ చేశారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కొందరు తల్లులకు రూ.8 వేలు, మరికొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.11 వేల చొప్పున మాత్రమే జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే తల్లుల ఖాతాల్లో వేస్తామంటూ మెలిక పెట్టి, తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామం పెట్టింది.

ఉన్నత విద్య భారం

పేద విద్యార్థులు ఎటువంటి ఆటంకమూ లేకుండా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉన్నతాశయంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాదాపు పూర్తిగా పక్కన పెట్టేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాదైనా నిధులు విడుదల చేస్తారని ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. కంటితుడుపుగా కొందరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వాస్తవానికి చాలామంది విద్యార్థులు నిధులు విడుదల కాక మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించాల్సి వచ్చింది.

నాణ్యత లేని ‘విద్యార్థి మిత్ర’

కార్పొరేట్‌కు దీటుగా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉన్నతాశయంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచిన రోజున విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలు, యూనిఫాం, బెల్టు, షూ, సాక్సులు, నాణ్యమైన స్కూల్‌ బ్యాగ్‌ వంటివి అందించింది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’గా మార్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి ఆ మహనీయునికే మచ్చ తెచ్చేలా విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చింది. స్కూల్‌ బ్యాగులు రెండు నెలలకే చిరిగిపోయాయి. బూట్లు ఇప్పటికే పాడైపోయాయి. దీంతో, విద్యార్థులు తరగతులకు చెప్పులతోనే హాజరవుతున్నారు.

ట్యాబ్‌లు గోవిందా..

విద్యార్థుల్లో డిజిటల్‌ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూజ్‌ కంటెంట్‌తో ట్యాబులు పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు తరగతిలో పాఠంతో పాటు ఇంటికి వెళ్లాక కూడా ఆ ట్యాబ్‌ల ద్వారా ఆ పాఠాలకు సంబంధించి మరిన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉండేది. అర్థం కాని విషయాలను కూడా వాటి ద్వారా సులభంగా గ్రహించేవారు. ఈ ట్యాబుల పంపిణీకి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలిచ్చింది.

ఎక్కడి నిర్మాణాలు అక్కడే..

మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పథకం పేరును ప్రస్తుత ప్రభుత్వం ‘మన బడి – మన భవిష్యత్తు’గా మార్చింది. నిధులు విదిల్చినప్పటికీ.. పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ప్రస్తుతం తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి.

బోధనేతర భారం

మరోవైపు ఉపాధ్యాయులు బోధనేతర భారంతో సతమతమవుతున్నారు. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. యాప్‌ల భారాన్ని తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. టీచర్లపై హాజరు నమోదు, ఇన్‌స్పెక్షన్‌, యూనిఫాం, పరిశుభ్రత, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, సాసా, కర్మయోగి తదితర పలు రకాల యాప్‌ల బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు పేరెంట్స్‌ – టీచర్స్‌ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. ఈ సమావేశాల కోసం గురువులు తమ జేబులోని సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది.

హామీల అమలెప్పుడో!

ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలును చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కూడా గాలికొదిలేసింది. 12వ పీఆర్‌సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన సర్కారు.. ఇప్పటి వరకూ కొత్త కమిటీని వేయలేదు. కనీసం ఐఆర్‌ కూడా ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు డీఏల చెల్లింపుపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైకి సంబంధించి ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరో డీఏ అంటే మొత్తం నాలుగు డీఏలను ప్రభుత్వం చెల్లించాలని ఉపాధ్యాయులు అంటున్నారు.

హుకుంపేట జెడ్పీ హైస్కూలులో నత్తనడకన తరగతి గదుల నిర్మాణం

విద్యారంగం.. గడ్డుకాలం1
1/2

విద్యారంగం.. గడ్డుకాలం

విద్యారంగం.. గడ్డుకాలం2
2/2

విద్యారంగం.. గడ్డుకాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement