సనాతన ధర్మ పరిరక్షణతోనే దేశాభివృద్ధి
● సామవేదం షణ్ముఖశర్మ
● బ్రహ్మజోస్యుల స్మారక పురస్కారం ప్రదానం
సీతానగరం: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం అవసరమని, సనాతన ధర్మ పరిరక్షణతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక తొలి పురస్కారాన్ని కుటుంబ సభ్యులు ఆయనకు ప్రదానం చేశారు. సీతానగరం కస్తూర్బాగాంధీ ఆశ్రమంలో ఆదివారం జరిగిన ఈ వేడుకలో సామవేదం మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం బ్రహ్మజోస్యుల చేసిన పోరాటం మరువరానిదని అన్నారు. అటువంటి మహనీయుని పేరిట ఇస్తున్న ఈ పురస్కారాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు. భారతీయ సంస్కృతీ పరిరక్షణకు మరో స్వాతంత్య్ర ఉద్యమం అవసరమన్నారు. భారతీయ సంస్కృతి యుగయుగాలుగా కొనసాగుతూ వస్తోందని, ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో మనదేశం వెలుగొందిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దేశాభ్యున్నతి దేశ సంస్కృతిలోనే దాగి ఉందన్న విషయం మరచిపోరాదన్నారు. హిందూ మత ప్రతినిధిగా స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యం గురించి విశ్వవేదికపై చాటి చెప్పారని గుర్తు చేశారు. సనాతన ధర్మం బాగుంటే దాని నీడన అన్ని మతాలూ క్షేమంగా ఉంటాయని చెప్పారు. హిందూ అనేది మతం కాదని, ధర్మమని స్పష్టం చేశారు. అందుకే ఇక్కడ మతం అనే మాటకు బదులు హిందూ ధర్మం, హిందూ సంస్కృతి అని అనాలన్నారు. ఇక్కడ ఎప్పుడూ అసహనం లేదన్నారు. క్షేత్రాలు, నదుల గురించి చెప్పి, ఆనాడే వ్యాస భగవానుడు ఐక్యత కలిగించాడని చెప్పారు. భూమిని తల్లిగా చూడాలని మన ధర్మం చెబుతోందని, తల్లిని గౌరవించలేనప్పుడు అది ధర్మమెలా అవుతుందని ప్రశ్నించారు. భరతవర్షం బాగుండాలని దేవతలు కూడా కోరుకుంటారని సామవేదం అన్నారు.
సామవేదం షణ్ముఖశర్మకు ఇవ్వడం వలన బ్రహ్మజోస్యుల పురస్కారానికి మరింత విలువ ఏర్పడిందని బెంగళూరుకు సచ్చిదానంద సరస్వతి మహాస్వామీజీ అన్నారు. బ్రహ్మజోస్యుల ఫౌండేషన్ కన్వీనర్ వారణాసి ధర్మసూరి మాట్లాడుతూ, డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పేరుతో ఫౌండేషన్ పెట్టి, పురస్కారం ఇవ్వాలని నిర్ణయించి, సామవేదం పేరును ప్రతిపాదిస్తే అందరూ ముక్తకంఠంతో ఆమోదించారని అన్నారు. మన సంస్కృతిని నాశనం చేయడానికే మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టారని, ఇప్పటికీ అదే ఆంగ్ల భాషను పట్టుకుని వేళ్లాడుతున్నామని ఆవేదన చెందారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మానసికంగా రాలేదని అన్నారు. డాక్టర్ దోర్భల ప్రభాకరశర్మ మాట్లాడుతూ, మన సంస్కృతి, మన భాష సంస్కృతాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గేయం ఆలపించడంతో కరతాళధ్వానాలు మిన్నంటాయి. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, శకునాలన్నీ సీతమ్మకు చేరేసరికి శుభకరమైనవిగా మారినట్లు.. పురస్కారాలు సామవేదం వారిని చేరి గౌరవం పెంచుకుంటున్నాయని అన్నారు. సీతానగరం ఆశ్రమం గురించి డాక్టర్ బొంగు రాజారావు వివరించారు. డాక్టర్ సీహెచ్‌వీ రమణీ కుమారి సన్మాన పత్రం చదివారు. సామవేదం వారిపై స్వీయ పద్యాలను కవితా ప్రసాద్ చదివి, సన్మాన సమితి తరఫున సమర్పించారు. డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి స్వాగతం పలికి, ప్రార్థన చేశారు. హైదరాబాద్‌కు చెందిన సామాజిక సేవావేత్త జేవీ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధి సుశీల, ఫౌండేషన్ కన్వీనర్ బ్రహ్మజోస్యుల వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


