నేటి నుంచి రెవెన్యూ క్లినిక్
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో అధికంగా వస్తున్న భూ సంబంధిత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని సోమవారం ప్రారంభిస్తున్నామన్నారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌తో పాటు ఈ క్లినిక్ కూడా కొనసాగుతుందని తెలిపారు. ఇకపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్‌డీఓలు ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
నేడు పీజీఆర్‌ఎస్
కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి తెలిపారు. దీనిని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలున్న పౌరులకు వసతులు కల్పించాలని సూచించారు. ప్రజలు 95523 00009 వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్రా యాప్ ద్వారా 36 ప్రభుత్వ శాఖలకు చెందిన 700కు పైగా సేవలను పొందవచ్చని వివరించారు.
ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా
అధ్యక్షుడిగా బాపిరాజు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం సిటీ): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా డిప్యూటీ తహసీల్దార్ గొలుగూరి బాపిరాజు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఎన్నికలు స్థానిక ఇన్నీసుపేటలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. సహాధ్యక్షుడిగా డిప్యూటీ తహసీల్దార్ ఎం.కాంతి ప్రసాద్, కార్యదర్శిగా డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ సురేష్‌బాబు, కోశాధికారిగా డిప్యూటీ తహసీల్దార్ ఎస్‌కే ఎండీ లాల్ అహ్మద్‌తో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కాకినాడ కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం.రామ్మోహన్, పరిశీలనాధికారిగా కపిలేశ్వరపురం డిప్యూటీ తహసీల్దార్ జి.శ్రీనివాస్ వ్యవహరించారు. ఎన్నికై న సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కమిటీ 2028 వరకూ మూడేళ్లపాటు కొనసాగుతుందని రామ్మోహన్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న బాపిరాజు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరయ్యే రెవెన్యూ ఉద్యోగులకు మంచి బస ఏర్పాటుకు రెవెన్యూ భవన్‌ను ఆధునీకరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఇన్సూరెన్స్, కలిసి వచ్చే ఉద్యోగులతో సొసైటీగా ఏర్పడి ఇళ్ల స్థలాల సాధనను ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామని అన్నారు. ఈ లక్ష్యాలను పుష్కరాల్లోపే సాధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్‌ఏ రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు, డిప్యూటీ తహసీల్దార్ వి.శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం అర్బన్, కొవ్వూరు డివిజన్ అధ్యక్షుడు డిప్యూటీ తహసీల్దార్ కె.రవివిక్రమ్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు బి.కృష్ణశాస్త్రి, మూడు యూనిట్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
లోవలో ఆన్‌లైన్ సేవలు
ప్రారంభం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవ స్థానంలో ఆదివారం నుంచి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి నాడు నిర్వహించే మహాచండీ హోమం, అమ్మవారి తిరు నక్షత్రం స్వాతి సందర్భంగా ని ర్వహించే పంచామృతాభిషేకాలతో పాటు ఊయ ల సేవ, వాహన పూజలు తదితర నిత్య సేవలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామన్నారు. కాటేజీలు, వసతి గదులు సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు.
వేలాదిగా భక్తుల రాక
తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు క్యూలో దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.61775, పూజా టికెట్లకు రూ.91960, కేశఖండన శాలకు రూ.3,080, వాహన పూజలకు రూ.4,750, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.36,020, విరాళాలు రూ.33,867, కలిపి మొత్తం రూ.2,31,452 ఆదాయం సమకూరిందని వివరించారు.


