గాడిద పట్ల మార్దవం.. గోవు పట్ల కరకుదనం..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘దుర్యోధనుడి పట్ల మృదువుగా మాట్లాడేవాడు గాడిద పట్ల మార్దవం, గోవు పట్ల కరకుదనం చూపేవాడవుతాడు’ అని ద్రుపదుడు అంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను ఆయన ఆదివారం వివరించారు. ‘‘అజ్ఞాతవాసం ముగిశాక బలరామ కృష్ణులు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు తదితర ప్రముఖులతో పాండవులు సమావేశయ్యారు. ‘దుర్యోధనునితో సౌమ్యంగా మాట్లాడాలని, శకునితో ద్యూతం ఆడటం ధర్మరాజు తప్పు’ అని బలరాముడు అంటాడు. ద్రుపదుడు ఈ మాటలను అంగీకరించక పై పోలిక తెస్తాడు. ఇందులో గాడిద ఎవరో, గోవు ఎవరో సుస్పష్టం’’ అని సామవేదం అన్నారు. ‘‘ధృతరాష్ట్రుని తరఫున పాండవుల వద్దకు వచ్చిన సంజయుడు యుద్ధం అవాంఛనీయమని చెబుతాడే కానీ, వారి రాజ్యభాగం గురించి మాట్లాడడు. యుద్ధం ధర్మరహితమైనదని అంటాడు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ధర్మసమ్మితమైన భోగాన్ని మాత్రమే కోరుతున్నామని ధర్మరాజు సమాధానం చెబుతాడు. దుర్యోధనుడు ఇతరుల మానాన్ని ధ్వంసం చేయాలనుకుంటాడు. అటువంటి వాడిని మానధనుడని ఎలా అనగలం?’’ అని సామవేదం ప్రశ్నించారు. ‘‘మా రాజ్యాన్ని దుర్యోధనుడు కోరుకుంటున్నాడు. మేము జీవించి ఉండగా మా రాజ్యాన్ని ఇంద్రుడు కూడా సొంతం చేసుకోలేడు. ఇంద్రప్రస్థంలో మా రాజ్యం మాకు ఇవ్వాలి’’ అని ధర్మరాజు స్పష్టం చేస్తాడు. ‘‘దీంతో, సంజయుడు వేదాంతం మాట్లాడతాడు. యుద్ధం చేయడం కన్నా భిక్షాటన మేలని అంటాడు. వేదాంతాన్ని అసందర్భంగా ఎలా అన్వయించుకోవచ్చునో ఈ వృత్తాంతం నుంచి తెలుసుకోవచ్చు’’ అని సామవేదం అన్నారు.


