డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా! | - | Sakshi
Sakshi News home page

డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!

Dec 28 2025 8:26 AM | Updated on Dec 28 2025 8:26 AM

డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!

డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!

వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట

ఇతర వృత్తులకు మళ్లుతున్న నిర్వాహకులు

రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్లు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుకుంటూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది.

సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే నిర్వాహకులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. వీటి నిర్వాహకులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు.

ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురముళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్‌ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు.

తగ్గుతున్న ఆదరణ

గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని నిర్వాహకులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement