కృషి, పట్టుదలతో లక్ష్య సాధన
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరమని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ఆవరణలో శనివారం ఇన్‌స్పిరిట్–2025 కార్యక్రమాన్ని ఆ విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసవర్మ మాట్లాడుతూ తిరుమల విద్యా సంస్థలు స్థాపించిన అనతికాలంలోనే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేశారన్నారు. ఈ విద్యా సంస్థ దేశానికి ఎంతో మంది ఇంజినీర్లను, వైద్యులను అందించడమే కాకుండా తల్లిదండ్రుల ఆలోచనలకు తగినట్లుగా పిల్లలను తీర్చిదిద్దిందన్నారు. తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్–2025 పరీక్షలలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులైన తమ 667 మంది విద్యార్థులు వివిధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, బిట్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన కళాశాలల్లో సీట్లు సాధించడం సంతోషదాయకమన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తాను జన్మించిన కాతేరులో తిరుమల విద్యా సంస్థలు స్థాపించిన నున్న తిరుమలరావు సేవలను కొనియాడారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా చక్కని వాతావరణంలో చదువుకోవాలన్నారు. అనంతరం ఇంజినీరింగ్ సీట్లు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్‌పర్సన్ శ్రీరష్మి, అకడమిక్ డైరెక్టర్ సతీష్‌బాబు, ప్రిన్సిపల్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


