రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్‌వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్‌ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్‌లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్‌లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్‌లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని నెట్‌బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు.


