కన్నీరే మిగిలింది | - | Sakshi
Sakshi News home page

కన్నీరే మిగిలింది

Dec 28 2025 8:24 AM | Updated on Dec 28 2025 8:24 AM

కన్నీ

కన్నీరే మిగిలింది

సాక్షి, రాజమహేంద్రవరం: కర్షకులకు ఈ ఏడాది కన్నీరు తప్పలేదు.. చంద్రబాబు ప్రభుత్వం నుంచి సహకారం కొరవడటం.. ఆపై విపత్తుల విశ్వరూపం వెరసి.. అన్నదాతలకు ఆక్రందనే మిగిలింది. పంట సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధులకు ఎగనామం పెట్టింది. ఉచిత పంటల బీమాకు మంగళం పాడి రైతుల నెత్తిన ప్రీమియం భారాన్ని మోపింది. పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావంతో నోటికాడ కూడు నీటి పాలైంది. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం అందించిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) నిర్వీర్యం చేసింది. రబీలో ఎరువుల కొరతతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం సకాలంలో అందించకుండా కాలయాపన చేసింది. ఇలా అన్నింటా రైతులను నట్టేట ముంచింది. వెరసి 2025 ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రైతులకు నిరాశ మిగిల్చింది.

అన్నదాతకు మొండిచేయి

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించి మోసం చేసింది. అధికారం చేపట్టిన తొలి ఏడాది నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రెండో దశలో 18,511 మంది రైతులకు మొండిచేయి చూపింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి రైతు భరోసా పథకంలో నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1,14,991కు చేరింది. సుమారు 1.10 లక్షల మంది కౌలు రైతులకు నయా పైసా ఇవ్వకుండా కంట తడి పెట్టించింది. గత నాలుగేళ్లలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేసింది.

విద్యుత్‌ కోతలు

వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని రోజులకే 9 గంటల విద్యుత్‌ సరఫరాను 7 గంటలకు తగ్గించింది. దీంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బీమాకు ఎగనామం

అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలన్న నిబంధనను తెరపైకి తెచ్చింది. 2024–25 రబీ సీజన్‌కు ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం రైతులే కట్టుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. వరి పంట హెక్టారుకు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. రైతుల భాగస్వామ్యం పేరుతో భారాన్ని మోపింది. ఫలితంగా వేల సంఖ్యలో రైతులు బీమాకు దూరమయ్యారు.

ఆర్బీకేల నిర్వీర్యం

రైతులకు వ్యవసాయ సేవలు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 367 రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, ఉద్యాన పంటలకు సైతం ఎంతగానో ప్రోత్సాహం అందించింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్‌లకు అప్పగించింది. తద్వారా రైతులు ఎరువులు తీసుకునేందుకు అవస్థలు పడాల్సిన పరిస్థితి తలెత్తింది.

ధాన్యం సేకరణకు నిబంధనలు

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు నిబంధనలు తీసుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధాన్యం తడిచినా, మొలకెత్తినా, రంగుమారినా కొనుగోలు చేయలేదు. మిల్లర్లకు నచ్చి.. వాళ్లు ఇచ్చే ధరకు విక్రయించుకోండంటూ చేతులేత్తసింది. ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో తాము మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు, దళారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకున్నారు. బస్తాపై రైతులు రూ.400 నష్టపోయారు.

అందని మోంథా సాయం

మోంథా తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు తుది నివేదిక ప్రభుత్వానికి పంపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 18 మండలాల పరిధిలో 33,262 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక రూపొందించారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నష్టపోగా, వాటి విలువ సుమారు రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ దాదాపు రూ.38.21 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఉద్యాన పంటలకు గిట్టుబాటు లేక..

2025 ఏడాదిలో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కరువైంది. జిల్లా వ్యాప్తంగా 90 వేల మంది రైతులు ఉద్యాన పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవి చూశారు. టన్నుకు రూ.50 వేలు అందాల్సి ఉండగా, కేవలం రూ.17 వేలు మాత్రమే దక్కింది.

కొబ్బరిదీ అదే దారి

జల్లా వ్యాప్తంగా 8,050 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి ప్రతి నిత్యం దాదాపు 50 లారీల కాయలు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 175 కాయల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా ఎక్కడా లేని డిమాండ్‌ ఏర్పడింది. వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. ప్రస్తుతం అది కాస్తా రూ.8 వేలకు పడిపోయింది. ఇలా కొబ్బరి ధరల్లో ఒడిదొడుకులతో రైతులు నానా అవస్థలు పడ్డారు.

అరటి రైతుల అవస్థలు

జిల్లాలో 7,500 హెక్టార్లలో అరటి తోటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా చక్కెరకేళీ, ఎర్ర చక్కెరకేళీ, అమృతపాణి, కర్పూరం రకాలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. జిల్లా నుంచి నిత్యం సుమారు 40 లారీల్లో అరటి గెలలను వివిధ ప్రాంతాలు, రాష్టాలకు తరలిస్తారు. మే నెలలో 10 టన్నుల లారీ ధర రూ.2 లక్షలు పలికింది. అది కాస్తా ప్రస్తుతం రూ.40 వేలకు పడిపోయింది.

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం

ధాన్యం విక్రయించిన 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం.. నెలలు గడిచినా నగదు ఇవ్వలేదు. గత రబీలో 3.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు చెల్లించేందుకు నెలలు గడిచింది. దీంతో రైతులకు ఆర్థికంగా అవస్థలు తప్పలేదు.

వ్యవసాయం

ఈ ఏడాది రైతులకు అష్టకష్టాలు

చంద్రబాబు ప్రభుత్వ సహకారం కరవు

ఆపై విపత్తులతో భారీ నష్టం

ఖరీఫ్‌ను ముంచేసిన మోంథా తుపాను

నేటికీ అందని నష్టపరిహారం

కన్నీరే మిగిలింది1
1/4

కన్నీరే మిగిలింది

కన్నీరే మిగిలింది2
2/4

కన్నీరే మిగిలింది

కన్నీరే మిగిలింది3
3/4

కన్నీరే మిగిలింది

కన్నీరే మిగిలింది4
4/4

కన్నీరే మిగిలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement