సమాజానికి సాయితత్వం అవసరం
తాళ్లపూడి: నేటి సమాజానికి సాయితత్వం ఎంతో అవసరమని ఆధ్యాత్మిక వేత్తలు అన్నారు. బల్లిపాడులోని కాకర్ల రామయ్య ఫంక్షన్ హాల్లో షిరిడీ సాయి సేవాదళ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత షిరిడీ సాయి భక్త సమ్మేళనం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సాయి ఆధ్యాత్మిక వేత్తలు అనఘానందస్వామి, కర్లపూడి కృష్ణ, సాయి శ్రీనివాస్, మధు సాయి, ఆదిపూడి సాయిరాం, రమణ మూర్తి తదితరులు సచ్ఛరిత్ర సాధన మార్గాలు, సమర్థ సద్గురుతత్వం, సాయి నామ మహిమలు, నేటి సమాజంలో సాయితత్వం ఆవశ్యకతపై ప్రసంగించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. వచ్చిన భక్తులకు సాయి సచ్చరిత్ర పుస్తకాలు, విభూతి, ప్రసాదాలను పంపిణీ చేశారు. సంస్థ చైర్మన్ సింహాద్రి జనార్దనరావు, ఫౌండర్ కాళ్ల రత్నాజీరావు ఆధ్వర్యంలో తాళ్లపూడి రైస్ మిలర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అల్లూరి విక్రమాదిత్య, అప్పన రాజా, గోకవరపు సూరిబాబు, కొండూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదుకు కార్యాచరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులను అధిక సంఖ్యలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీల్లో సభ్యులుగా నమోదు చేయించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల జాబితాను సేకరించి, ఆయా విద్యాసంస్థలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, విద్యార్థులను సభ్యులుగా నమోదు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రతి కళాశాల, పాఠశాలలో ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించి, సభ్యత్వ నమోదుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాకారానికి కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌న్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యానికి
5న బహిరంగ వేలం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అక్రమ కేసులలో స్వాధీనం చేసుకున్న 33.85 క్వింటాళ్ల రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని నిబంధనల మేరకు బహిరంగ వేలం విధానంలో విక్రయించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ శనివారం తెలిపారు. 2026 జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ వద్ద గల పౌర సరఫరాల కార్యాలయంలో సంబంధిత అధికారుల సమక్షంలో ఆ ప్రక్రియ జరుగుతుందన్నారు. పాల్గొనే ఆసక్తి కలిగినవారు జనవరి 3న పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచిన బియ్యం నమూనాలను పరిశీలించుకోవచ్చన్నారు. అలాగే నిబంధనల ప్రకారం రూ.50 వేలు ధరావత్తు చెల్లించి, నిర్దిష్ట నమూనాలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇప్పటికే 6ఏ కేసులు నమోదై, పెండింగ్‌లో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హులన్నారు.
హిందువులందరూ ఏకం కావాలి
కరప: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులందరకూ ఏకం కావాలని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ దివ్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా శనివారం నీలయ్య తోటలోని ఒకలే అవుట్‌లో మండల సహ కన్వీనర్ కొక్కెరమట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలన్న ఆశయంలో ఇంత వరకూ 1.50 లక్షల సమ్మేళనాలు జరిగాయన్నారు. హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయాలన్నారు.
సమాజానికి సాయితత్వం అవసరం


