పరుగు పోటీలకు ఎడ్లు, గుర్రాలు సిద్ధం
● వడిశలేరులో నేడు రాష్ట్ర స్థాయి పోటీలు
● విజేతలకు బహుమతులుగా
మోటారు సైకిళ్లు
రంగంపేట: సంక్రాంతి శోభను ముందుగానే తీసుకువస్తూ వడిశలేరు రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా సంబరానికి ముస్తాబైంది. ఆదర్శ రైతు దివంగత గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం, జీఎస్‌ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో 7వ వార్షిక రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు వంద ఎడ్ల బళ్లు, 50 గుర్రాలు ఈ పోటీల్లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అటు ఎడ్లు, గుర్రాల పరుగు పోటీలను వేర్వేరు ట్రాక్‌లపై ఒకే సమయంలో నిర్వహించడం ఈసారి ప్రత్యేకత. టైమ్ రికార్డింగ్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా విజేతలను నిర్ణయిస్తారు.
బహుమతుల వివరాలు
ఎడ్లబళ్ల పోటీలకు సంబంధించి సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలకు మొత్తం ఆరు మోటారు బైక్‌లు అందజేస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, ద్వితీయ, తృతీయ బహుమతులుగా హోండా షైన్ ఇవ్వనున్నారు. 3టీ ఇన్నోవేషన్స్ సౌజన్యంతో 75 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు.
గుర్రాల విభాగంలో మొదటి ఏడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతిగా రూ.40 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా 25 వేలు చొప్పున అందిస్తారు. మొత్తం ఏడుగురికి వీటిని అందజేస్తారు.
పరుగు పోటీలకు ఎడ్లు, గుర్రాలు సిద్ధం


