సానుకూల దృక్పథంతో లక్ష్య సాధన
రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, టెలికమ్యూనికేషన్ మంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు తిరుమల విద్యా సంస్థల ఆవరణలో శుక్రవారం మెడ్‌సినాప్స్–2025 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనికి తిరులమ విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ నీట్–2025లో ఉత్తీర్ణత సాధించిన తిరుమల విద్యార్థుల్లో 251 మంది వివిధ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. 2011లో 700 మంది విద్యార్థులతో ప్రారంభమైన తిరుమల విద్యా సంస్థలో నేడు 43 వేల మంది విద్యార్థులు ఉండడం వెనుక ఒక కఠోరమైన శ్రమ ఉందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో విద్యా సంస్థలు అంటే గుంటూరు, విజయవాడ మాత్రమే అనుకునేవారని, ఇప్పుడు రాజమహేంద్రవరంలో తిరుమల విద్యాసంస్థలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందదాయకమన్నారు. రుడా చైర్‌పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలన్నారు. హైదరాబాద్ యశోధ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యురాలు కోన లక్ష్మీకుమారి మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఎంతో నిబద్ధతతో పనిచేయాలన్నారు. తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు మాట్లాడుతూ నీట్–2025లో ఆలిండియా 19వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రాజమహేంద్రవరం విద్యార్థి సాధించారన్నారు. అలాగే రాజమహేంద్రవరం క్యాంపస్ నుంచి 188 మంది వైద్య సీట్లు సాధించారన్నారు. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులకు స్టెత్‌స్కోప్, జ్ఞాపికలను ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు. అకిరా కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఎన్.ప్రభాకరరావు, తిరుమల విద్యా సంస్థల వైస్ చైర్‌పర్సన్ శ్రీరేష్మి, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ శ్రీహరి పాల్గొన్నారు.


