పైసలిస్తే పర్మిషన్!
● సొంత భూముల్లో ఇసుక
తవ్వకాలకు వసూళ్ల పర్వం
● ఎకరానికి రూ.లక్ష కప్పం
● అధికారులు, ఓ ప్రజాప్రతినిధి
మిలాఖత్ అయ్యారని ఆరోపణలు
● జిల్లావ్యాప్తంగా 352 ఎకరాల్లో అనుమతులు
● 63,16,943 టన్నుల ఇసుక తీసే అవకాశం
● రైతుల పేరుతో కూటమి నేతలకు
లబ్ధి చేకూర్చే ఎత్తుగడ
సాక్షి, రాజమహేంద్రవరం: ఇప్పటికే దొరికిన చోటల్లా ఇసుక పిండి.. రూ.కోట్లు కొల్లగొడుతున్న కూటమి నేతలు.. తాజాగా పట్టా భూముల్లో తవ్వకాల పేరుతో భారీ దోపిడీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అనుమతులు మంజూరు కాగా.. వాటిల్లో తెర వెనుక కూటమి నేతలే ఉన్నట్లు సమాచారం. పొలాల యజమానుల పేర్లతో అనుమతులు తీసుకుని.. యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. ఈ అవినీతి వ్యవహారాలన్నీ కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతూండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా ప్రజాప్రతినిధులతో కొంతమంది అంటకాగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా అనుమతులు
జిల్లావ్యాప్తంగా ఓపెన్ రీచ్‌లు, బోట్స్‌మెన్ సొసైటీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. జిల్లాలోని ప్రక్కిలంక, సీతానగరం తదితర 15 ప్రాంతాల్లో 352 ఎకరాల సొంత భూముల్లో ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు. తద్వారా 63,16,943 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వాలన్నది లక్ష్యం. మరికొన్ని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు మరో 38 దరఖాస్తులు అందాయి. వాటికి సైతం అనుమతులు లాంఛనమే కానున్నాయి. ఇదే కనుక జరిగితే భారీ ఇసుక దోపిడీకి తెర లేవనుంది. లక్షల టన్నుల ఇసుక పక్కదారి పట్టే అవకాశం ఉంది.
ముడుపు కడితేనే..
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో వసూళ్లకు తెగబడుతున్నారు. రైతుల భూముల్లో ఇసుక తవ్వుకోవాలంటే రెవెన్యూ అధికారులు ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఆ తర్వాతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ భూములు వ్యవసాయానికి పనికిరావని నిర్ధారించాలి. ఆ తర్వాతే అనుమతులు మంజూరు చేస్తారు. ఇక్కడే అక్రమ దందాకు తెర లేపుతున్నారు. ఈ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎకరానికి రూ.లక్ష కప్పం కట్టాల్సింనంటే రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేస్తున్నారు. అడిగినంతా ముడుపు కడితే నిమిషాల వ్యవధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చేస్తున్నారని, లేదంటే కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 352 ఎకరాల్లో అనుమతులు ఇవ్వగా.. ఈ ప్రక్రియలో రూ.కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజాప్రతినిధి లంచావతారం!
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతుల విషయంలో ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి లంచావతారం ఎత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎ కరానికి తనకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర సమర్పించాలని ఆయన హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు ఆవిధంగా ముట్టజెప్పగా.. మరికొందరు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు కొంతమంది కూటమి నేతలు బినామీ పేర్లతో అనుమతులు పొందడం గమనార్హం. దీంతో, వారు తాము కూడా కప్పం కట్టాలా అని సదరు ప్రజాప్రతినిధిని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో, వాళ్ల వరకూ మినహాయింపు ఇచ్చారని, మిగిలిన వారు మాత్రం చెప్పినంతా చెల్లించాల్సిందేనని ఆయన తెగేసి చెప్పారని అంటున్నారు. ఇదే అదునుగా కొంత మంది రెవెన్యూ అధికారులు సైతం దందాకు తెర లేపారు. ప్రజాప్రతినిధులకే కాదని, తమకు సైతం చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.
తూతూమంత్రంగా..
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వాలంటే మైనింగ్ అధికారులు తొలుత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. మెజార్టీ ప్రజలు అంగీకరిస్తేనే అనుమతి ఇవ్వాలి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అభిప్రాయ సేకరణ పేరిట గ్రామంలో నలుగురిని తీసుకొచ్చి అభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వారితోనే సంతకాలు చేయించేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఇదే విధంగా జరిగినట్లు విమర్శలున్నాయి. ప్రక్కిలంకలో 36 మంది రైతులకు చెందిన భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. టన్ను ఇసుకకు రూ.158 చెల్లించేలా నిర్ధారించారు. కేవలం లంకల్లోనే 12,92,400 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు అనుమతులు ఇచ్చారు. సీతానగరం తదితర ప్రాంతాల్లో మరిన్నిచోట్ల తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రక్కిలంకలో ఇప్పటికే ఇసుక రీచ్ ఉంది. ఇసుక తవ్వకాలు, విక్రయాలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ పట్టా భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు దాగుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూటమి నేతలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తాళ్లపూడి మండలం ప్రక్కిలంక ఇసుక ర్యాంప్
అవసరానికి మించి..
జిల్లావ్యాప్తంగా అవసరాలకు మించి ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపెన్ రీచ్‌ల ద్వారా 20 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది. బోట్స్‌మెన్ ర్యాంపుల ద్వారా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సమకూరే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లు కొత్తగా పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు అనుమతులు ఇచ్చారు. అదే ఇసుక ప్రజలు, ప్రభుత్వ పనులు, ప్రైవేటు అవసరాలకు సరిపోయింది. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క మన జిల్లాలోనే కోటి మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు ‘పచ్చ’ జెండా ఎందుకు ఊపుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ఈ ఇసుకను ఇతర జిల్లాల అవసరాలకు కేటాయిస్తున్నామని అధికారులు చెబుతున్నా రు. ఇతర జిల్లాలకై నా అంత మేర స్టాక్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి జిల్లాలో ఇసుక అవసరమెంత.. తవ్వుతున్నదెంత.. లక్షల టన్నుల ఇసుక ఎందుకు తవ్వుతున్నారు.. ఇదంతా ఎక్కడికి తరలిస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి.


