ఐటీ పార్క్‌కు అంజుమన్ భూములా?
● చంద్రబాబు సర్కారుపై
మైనారిటీ నేతల మండిపాటు
● భూముల పరిరక్షణకు
పోరాడతామని వెల్లడి
రాజమహేంద్రవరం రూరల్: గుంటూరు జిల్లా చినకాకానిలోని అంజుమన్–ఎ–ఇస్లామియా సంస్థకు చెందిన భూములను చంద్రబాబు ప్రభుత్వం ఐటీ పార్కుకు కట్టబెట్టడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ హమీద్ బాషా మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు హడావుడిగా మొత్తం సమావేశం ఏర్పాటు చేసి, ఇష్టం లేకపోయినా బలవంతంగా సంతకాలు చేయించి, 82 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్‌కు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంజుమన్–ఎ–ఇస్లామియా సంస్థకు 1915లో దాతలు ఈ భూమి ఇచ్చారని చెప్పారు. ముస్లింల స్కిల్ డెవలప్‌మెంట్, లైబ్రరీ, ముస్లిం పిల్లల స్కాలర్‌షిప్‌లు, వారి విద్యా సంస్థల కోసం ఈ భూమిని ఇచ్చారన్నారు. అటువంటి ఈ భూమిలో 71.53 ఎకరాలు ఐటీ పార్క్‌కు కట్టబెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి ముస్లిం ఆస్తుల పరిరక్షణకు అధికార పార్టీలోని ముగ్గురు మైనారిటీ ఎమ్మెల్యేలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. నేడు ముస్లింలకు అన్యాయం జరుగుతోందని, రేపు క్రిస్టియన్లకు, ఆ తరువాత హిందువుల భూములను చంద్రబాబు సర్కారు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని, అందువలన కులమతాలకు అతీతంగా అందరూ దీనిపై పోరాడాలని అన్నారు. ముస్లిం సంస్థ ఆస్తులను చంద్రబాబు సర్కారు బలవంతంగా లాక్కుంటే ఈ విషయాన్ని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యాన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. 2029లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐటీ పార్కుకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ భూముల పరిరక్షణకు కార్యాచరణ రూపొందించి, పోరాడతామని హమీద్ బాషా చెప్పారు.
రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. దీనికి భిన్నంగా అంజుమన్–ఎ–ఇస్లామియా భూములను ఏపీఐసీసీకి, ఇతరులకు కట్టబెట్టేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని మండిపడ్డారు. దీనిని చంద్రబాబు ప్రభుత్వంలోని మైనారిటీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రి ఫరూక్, సలహాదారు షరీఫ్ అడ్డుకోవాలని కోరారు. భూముల అన్యాక్రాంతాన్ని నిలిపివేసేంత వరకూ పోరాడతామని హెచ్చరించారు.
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ హసీనా మాట్లాడుతూ, అంజుమన్–ఎ–ఇస్లామియా ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. వక్ఫ్ ఆస్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని మైనారిటీ నేతలందరి పైనా ఉందని చెప్పారు. ఈ భూములను ఐటీ పార్కుకు ఇస్తే చంద్రబాబు సర్కారును అల్లా కూడా క్షమించరని స్పష్టం చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎండీ ఆరీఫ్ మాట్లాడుతూ, ముస్లింల సంక్షేమానికి ఉపయోగించాల్సిన అంజుమన్–ఎ–ఇస్లామియా భూములను ఐటీ పార్కుకు ఇచ్చేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నించడం క్షమించరాని నేరమని అన్నారు. దీనిపై ఇచ్చిన జీఓను రద్దు చేసేంత వరకూ పోరాడతామని హెచ్చరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం సామాజికవర్గం పూర్తి నిరాదరణకు గురైందని అన్నారు. వక్ఫ్ బిల్లుకు ఓటు వేయడం ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ముస్లింలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జోనల్ అధ్యక్షుడు హసన్, సీనియర్ నాయకులు నయీమ్ భాయ్, మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే ఇబ్రహీం బాషా, అధికార ప్రతినిధి షట్టర్ బాషా, మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు ఎండీ ఆరిఫ్ ఉల్లాఖాన్, ప్రధాన కార్యదర్శి షబ్బీర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.


