హైటెక్ దాసులు
ఉప్పలగుప్తం: ధనుర్మాసం వస్తూనే వేకువ జామునే శిరస్సున అక్షయ పాత్ర.. మెడలో చామంతుల మాల.. ఓ చేతిన చిడతలు.. మరో చేతిన తంబుర.. పాదాలకు మంజీరాలు.. నోట సుస్వర హరినామ సంకీర్తనలు.. పెద్దపెద్ద అంగలతో ఇంటింటికీ తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించి నమస్కరించినవారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓ నాటి దృశ్యకావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ.. మారిన కాలంతో పోటీ పడి తానూ మారుతూ వాహనధారియై.. దాని హెడ్‌లైట్‌పై అక్షయ పాత్ర.. హ్యాండిల్‌కి మైక్.. దాని నుంచి హరినామ సంకీర్తనలు.. ఇదీ ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునీకత సంతరించుకుంటారో చూడాలి మరి. వీరికీ ఓ ఘన చరిత్ర.. కఠోర దీక్ష.. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకితభావం ఉండడం చెప్పుకోదగ్గ విషయం.
వైష్ణవులలో ఓ వర్గం నియమ నిబద్ధతలతో కూడిన మహావిష్ణు దీక్షను భక్తితో స్వీకరిస్తారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరులు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కాపాడటానికి అవలంబించే 41 రోజుల కఠోర దీక్ష ఇది.
ఈ దీక్షలను కార్తికం, ధనుర్మాసం, మాఘమాసాల్లో సంబంధిత గురువుల వద్ద స్వీకరిస్తారు. ఈ హరిదాసు దీక్షలకు సంబంధించి భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ క్షేత్రం ఉంది. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకూ వారి తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ హరి నామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తల స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయపాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయపాత్ర పెట్టుకుంటే అది దింపే వరకూ దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. దీక్షాకాలం అనంతరం విష్ణు, శివాలయాల్లో దీక్షను విరమిస్తారు. దీక్షలో స్వీకరించిన భిక్షను తమ అవసరాలకు కొంత మిగుల్చుకుని భధ్రాచలం రాముల వారి కల్యాణంలో జరిగే అన్నదానానికి పంపిస్తారు. సాధారణ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు.
ఇంత కఠిన దీక్షను నేటి తరం ఆచరించే శారీరక సామర్థ్యం లేక ఆధునిక వసతులను వినియోగించుకుంటూ సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తున్నారు. ఈ పయనంలో భాగంగా మోటారు సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచకా సాగిపోతున్నారు. వీరు సుమారు 4, 5 గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. ఈ గ్రామాల్లో సంచరిస్తే వచ్చేది రోజకు కేవలం నాలుగైదు కుంచాల బియ్యం మాత్రమే. ప్రస్తుతం మోటారు సైకిల్‌పై తిరగటంతో దాని ఇంధనంతో పాటు ఇతర ఖర్చులకు 3 నుంచి 4 వందలు ఖర్చవుతుంది.
ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వాల పరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. కొంతమంది దృష్టిలో వీరు భక్తులా, లేక ఒక వృత్తినే నమ్ముకున్న వారా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరి సామాజిక వర్గాలకు చెందిన వీరు బిసీ–డీ కేటగిరీగా పరిగణించబడుతున్నారు. వీరు ఎక్కువగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణ, అనకాపల్లి జిల్లాలో నివసిస్తుంటారు. వీరికి రిజర్వేషన్ కోటాలో తక్కువగా ప్రాధాన్యత ఉండి వారి పిల్లలు విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్నప్పటికీ బీసీ–ఏ గా మార్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వారిని బీసీ–ఏగా మార్చడానికి సన్నాహాలు చేసినప్పటికీ కొందరి అభ్యంతరాలతో పిటిషన్‌లు పెట్టి అడ్డుకున్నారని ఆ సామాజిక వర్గాల వారు ఆవేదన చేస్తున్నారు.
మారుతున్న కాలంతో మున్ముందుకు
సంస్కృతిని, వారసత్వాన్ని
కొనసాగిస్తున్న వైనం
ఆదాయాన్ని వదులుకుని
ఆచారానికి పెద్దపీట
ఎంతటి వారైనా
గజ్జెకట్టి అక్షయ పాత్ర పట్టాల్సిందే
భక్తి శ్రద్ధలతో..
హరినామ సంకీర్తనతో కఠోర దీక్ష


