ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు
● రాధామనోహర్ దాస్
● వాకలపూడిలో హిందూ సమ్మేళనం
కాకినాడ రూరల్: హిందువుల్లో ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్త రాధామనోహర్ దాస్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వాకలపూడిలో గురువారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని మతాల కన్నా హిందూ మతం చాలా గొప్పదని అన్నారు. దేశంలోని వారు మతం మారినంత మాత్రాన మానవత్వం మరచిపోరాదని కోరారు. భారతదేశానికి జన్మించిన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు నేడు హిందూ మతానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నాయని, వారి పీచం అణచివేయాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వెయ్యి సంవత్సరాలుగా హిందూ మతంపై అనేక దాడులు జరిగాయని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు దంగేటి సత్యనారాయణ, సాధుల శేషపాన్పు, బిందుశ్రీ తదితరులు కూడా ప్రసంగించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, వేద మంత్ర పఠనం నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నాయకులు సుబ్రహ్మణ్యం, రామరాజు, అప్పాజీ తదితరులతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.


