
అప్పనపల్లికి పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి పాత గుడితో పాటు కొత్త గుడి వద్ద సందడి నెలకొంది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ,భూ సమేత బాలబాలాజీ స్వామిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.1,18,346 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. నిత్య అన్నదానానికి రూ.58,120 విరాళాలు అందించారన్నారు. స్వామివారిని 1,500 మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. వెయ్యి మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు.
వరద నీటిలో వ్యక్తి మృతదేహం
రాజోలు: స్థానిక వశిష్టా నదీ తీరానికి వరద నీటిలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం (60) కొట్టుకువచ్చింది. ఇక్కడి కాటన్ పార్కు వద్ద చెట్ల పొదల్లో చిక్కుకుంది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉరివేసుకుని యువకుడి మృతి
పెరవలి: ఉసులుమర్రులో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెరవలి ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. నరసాపురం గ్రామానికి చెందిన బొర్రా తరుణ్ (20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, అమ్మమ్మ ఊరైన ఉసులమర్రుకు ఈ నెల 21న వచ్చాడు. ఏమైందో ఏమో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరివేసుకున్నాడని, పోస్టుమా ర్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. అతని మేనమామ బొరుసు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.
గ్రామీణ క్రీడా పోటీలు
కాకినాడ క్రైం: కాకినాడలోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరం ఆరంభమైంది. ఐడియల్ కళాఽశాల మైదానంలో ఈషా గ్రామోత్సవంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. 120 మందితో కూడిన 20 జట్లు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. హోరాహోరీ పోరులో నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. పోటీలు ఆదివారంతో ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఆదివారం మహిళల త్రోబాల్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.