
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు ప్రధాన రహదారిలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు కూచిపూడి బుల్లారావు(71) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకోవడానికి బైక్‌పై వెళ్తున్న సర్పంచ్ కూచిపూడి బుల్లారావును ఎదురుగా వస్తున్న క్వారీ టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. బుల్లారావు తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. సర్పంచ్ బుల్లారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.