
క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించాలి
అమలాపురం టౌన్: క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధి నిర్థారణ, నివారణ సామర్థ్యాలు బలోపేతమవుతాయని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర అన్నారు. జిల్లావ్యాప్తంగా క్యాన్సర్ లక్షణాలున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన శిక్షణ తరగతుల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో మాట్లాడారు. గురువారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ అసంక్రిత వ్యాధుల (ఎన్‌సీడీ) గుర్తింపుపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ శిక్షణ తరగతుల నోడల్ ఆఫీసర్ తిరుమలరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమలత, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, డాక్టర్ అనూష శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించారు. కాన్సర్ కారకాలు, ప్రాథమిక దశ లో గుర్తించడం వంటి అంశాలను వివరించారు.