
వర్షాలకు ఆందోళన వద్దు
రాజమహేంద్రవరం రూరల్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. ఆయన గురువారం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కలిసి తొర్రేడు, వెంకటనగరం, కోలమూరు గ్రామాల్లోని వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జల్ల కాలువ కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరి ముంపునకు గురైందని, తొందరలోనే అదనపు నీరు బయటకు పోతుందన్నారు. ఈ వర్షాలు పంట ఎదుగుదలకు దోహదం చేయడమే కాక, ఆకుముడత, ఆకునల్లి పురుగులు నీటిలో కొట్టుకుపోతాయన్నారు. ఒకవేళ పంట ముంపునకు గురైతే ఈ క్రింది యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. పల్లపు ప్రాంతాలలో వరి పంట ఊడ్చిన దశ నుంచి పిలకలు దశలో నీట ముంపునకు గురి కావడం జరిగిందన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, ఎంటీయూ 1262, స్వర్ణ, సంపద స్వర్ణ, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఐదు రోజుల వరకు ముంపును తట్టుకుంటాయన్నారు. ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ల నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బెన్డిజిమ్ లేదా 2 గ్రాము కార్బెన్డిజిమ్, మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత త్వరగా నీటిని తీసివేయాలన్నారు.