
పెరిగిన గోదావరి ఉధృతి
ధవళేశ్వరం: స్థానిక కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. దీంతో మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీటి ఉధృతి పెరిగినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మరోపక్క గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెంలలో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో రెండు రోజుల్లో కాటన్ బ్యారేజీ వద్ద వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 6,07,682 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే రాత్రి 9.10 అడుగులకు నీటి మట్టం చేరింది. డెల్టా కాలువలకు సంబంధించి 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 1,500, మధ్య డెల్టాకు 100, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు.
రేవు వద్ద వాహనాల రద్దీ
సఖినేటిపల్లి: చించినాడ వంతెన మరమ్మతుల కారణంగా సఖినేటిపల్లి రేవు వద్ద సోమవారం వాహనాల రద్దీ ఏర్పడింది. రాజోలు నియోజకవర్గ ప్రజలకు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమైన చించినాడ వంతెనను ఒక రోజు మూసివేశారు. దీంతో సఖినేటిపల్లి వద్ద వశిష్ట రేవులో పంట్లపై దాటేందుకు వాహనాల్లో తరలివచ్చారు.

పెరిగిన గోదావరి ఉధృతి