
దేవదాయ శాఖ ఆధీనంలోకి వారాహి అమ్మవారు
సింగిల్ ట్రస్టీగా శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఈఓ సౌజన్య
కాకినాడ రూరల్: మండలంలోని కొవ్వూరు గ్రామం వారాహి అమ్మవారు దేవదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లారు. ఈ మేరకు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు ఆదేశాల మేరకు శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకుని, పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఈఓ ఎస్.సౌజన్యకు సింగిల్ ట్రస్టీగా బాధ్యతలు అప్పగించారు. వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు. కొవ్వూరులో వారాహి అమ్మవారిని అన్నాచెల్లెళ్లు కాళ్ల ప్రసన్నరాణి, పద్మలక్ష్మి, సత్యనారాయణ ఏడాది క్రితం స్థాపించారు, దర్శనం, పూజల కోసం భక్తులు విపరీతంగా పెరిగిపోయారు. సౌకర్యాలు లేక భక్తులు, గ్రామంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయల విరాళం వస్తున్నాయని, అవి దుర్వినియోగం అవుతున్నట్టు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు అందడంతో, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖను కలెక్టరు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ తనిఖీదారు విచారణ చేసి, నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వారి నుంచి సమాధానం రాకపోవడంతో సింగిల్ ట్రస్టీగా ఈఓ సౌజన్యకు బాధ్యతను అప్పగించినట్టు దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.ఫణీంద్రకుమార్ తెలిపారు.