మళ్లీ అదే తప్పు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే తప్పు

Aug 11 2025 6:36 AM | Updated on Aug 11 2025 6:36 AM

మళ్లీ అదే తప్పు

మళ్లీ అదే తప్పు

సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు భారీ పెళ్లి సెట్టింగ్‌

విశ్రాంతి షెడ్డు సగం ఆక్రమించి.. అట్టహాసంగా వివాహం

సూర్య నమస్కారాల వద్దకు భక్తులు వెళ్లకుండా అడ్డంగా సామగ్రి

సేద తీరే వీలు కూడా లేని వైనం

అన్నవరం: ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే అది అలవాటుగా మారిందనే అంటారు. అన్నవరం దేవస్థానంలో అధికారుల తీరు ఇలాగే ఉంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏం జరిగిందంటే.. అధికార పార్టీ నాయకుల సిఫారసుతో రత్నగిరిపై సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు దేవస్థానం అధికారులు గత జూన్‌ 8న ఓ వివాహానికి అనుమతి ఇచ్చారు. అప్పట్లో ఆ వివాహ బృందం వారు అక్కడి విశ్రాంతి షెడ్డులో సగ భాగాన్ని ఆక్రమించారు. దీంతో, భక్తులు ఇబ్బందులు పడ్డారు. నాడు అధికారులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సహజంగానే విమర్శలు వచ్చినప్పుడు తమ వైపు తప్పుంటే ఎవరైనా అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, అదే వార్షిక కల్యాణ మండపం ముందు ఆదివారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం వారు విశ్రాంతి షెడ్డులో సగ భాగాన్ని ఆక్రమించారు. భక్తులు ఆ ఛాయలకు రాకుండా కుర్చీలు వేశారు. అడ్డంగా రిబ్బన్‌ కట్టారు. భారీ పెళ్లి మండపం ఏర్పాటు చేసి, అట్టహాసంగా వివాహం జరిపించారు. ఉదయం 9.30 గంటల వరకూ ఆ వివాహ తంతు కొనసాగింది. అనంతరం మధ్యాహ్నం వరకూ కూడా ఆ మండపాన్ని అలాగే ఉంచేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదివారం కావడంతో వార్షిక కల్యాణ మండపంలో పండితులు సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఈ వివాహ సెట్టింగ్‌తో సూర్య నమస్కారాలు భక్తులకు కనిపించనే లేదు. పండితులు ఆ సెట్టింగ్‌ వెనుకనే ఉండి సూర్య నమస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. భక్తులు అక్కడకు వెళ్లి తీర్థప్రసాదాలు స్వీకరించే వీలు లేకుండా వివాహ మండప సామగ్రిని సంబంధిత సిబ్బంది అడ్డంగా పెట్టారు. ఈఓ కార్యాలయం సమీపంలోనే.. అందరి కళ్లెదుటే ఇంత జరుగుతున్నా అధికారులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే ఈ వివాహానికి అనుమతిచ్చారని సమాచారం. అయితే దీనిపై అధికారులు నోరు విప్పడం లేదు.

సర్వత్రా విమర్శలు

సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు దేవస్థానం వైదిక క్రతువులు తప్ప మరే ఇతర కార్యక్రమా లూ నిర్వహించరు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ మండపం ఎదురుగా పెద్ద వివాహ సెట్టింగులను అనుమతించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఈవిధంగా అనుమతివ్వలేదు. కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇలా జరుగుతోందని దేవస్థానం సిబ్బంది కూడా అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement