
రాష్ట్రంలో వైద్యుల కొరత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లోని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 59 శాతం ఖాళీలు ఉన్నాయని, ఆయా విభాగాల్లో డాక్టర్ల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్‌లో చిన్న పిల్లల ఐసీయూలతో నిర్మించిన రెండంతస్తులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద కేంద్రం అందించే రూ.11 కోట్లతో వీటిని నిర్మించామన్నారు. రెండో అంతస్తులో పీడియాట్రిక్ ఐసీయూ, ఎన్‌ఐసీయూ, స్టెప్ డౌన్ హెచ్‌డీయూ విభాగాలు, 25 పడకలతో రెండు వార్డులు, మూడో అంతస్తులో నవజాత శిశువుల సంరక్షణకు ఉద్దేశించిన ఎస్‌ఎన్‌సీ–1, ఎస్‌ఎన్‌సీ–2 తల్లుల వార్డు, ఈఎన్‌టీ, చర్మవ్యాధుల కేంద్రం ఉన్నాయని వివరించారు. పిల్లల వార్డులో 75, తల్లుల వార్డులో 25 చొప్పున పడకలు ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లను 4 నుంచి 22కు పెంచామన్నారు. వీల్ చైర్లు ఏర్పాటు చేశామని, మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరిచామని చెప్పారు. వచ్చే నెల నుంచి రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు ఎన్‌సీడీ–3 సర్వే ప్రారంభిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ల నివారణకు ప్రముఖ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారన్నారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు రూ.352 కోట్లు విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ వెంకటేష్, సూపరింటెండెంట్ డాక్టర్ జి.రాజశేఖర్ కెనడీ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.