
చరిత్ర పుటల్లో రక్తాక్షరాలు
ఆలయం వద్ద స్మారక స్థూపం
కొత్తపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం విశిష్టత అమోఘమైంది. అశేష భక్తజన సంద్రంతో కోనసీమ తిరుమలగా వెలుగొందుతున్న ఈ క్షేత్రానికి సంబంధించి ఈ తరానికి తెలియని మరో ముఖ్య చరిత్ర కూడా ఉంది. ఇదే ఈ గడ్డపై దైవ భక్తులతో పాటు దేశభక్తుల ఉనికిని చాటుతోంది. వాడపల్లి గ్రామం చిన్నదైనా.. ఇక్కడి నేల పొరల్లో దశాబ్దాల క్రితం త్యాగాలను నాటి.. రక్తాన్ని ధారపోశారు. ఇవన్నీ భారతావని కోసం.. జాతి విముక్తి కోసం. అప్పట్లో దేశంలో ఎన్నో త్యాగాలు చేసిన అనేక పల్లెలుంటే.. అందులో వాడపల్లి ప్రత్యేకతను సంతరించుకుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. చరిత్ర పుటల్లో వాడపల్లిలో దేశభక్తులపై బ్రిటిష్ వారి దాష్టీకం, ఆంగ్లేయులకు ఎదురెళ్లి రక్తం చిందించిన త్యాగధనులను స్మరించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులపై ఉంది.
రథంపై జాతీయ జెండా ఎగరేసినందుకు..
1931 మార్చి 30 చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినం. వాడపల్లిలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా రథోత్సవం జరగనుంది. ఆరోజు మాతృదాస్య శృంఖలాల విమోచనోద్యమ రథసారథి బాపూజీ శంఖారావానికి ప్రతిస్పందించిన స్వాతంత్య్ర సమరయోధులు.. బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనను సంఘటితంగా ప్రతిఘటించిన పవిత్ర దినం. రథోత్సవ వేడుకల్లో భక్తితో పాటు, దేశభక్తినీ చాటేందుకు రథంపై బాపూజీ చిత్రపటాన్ని ఉంచి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శత్రు స్థావరంపైకి దండెత్తుతున్న సైనికుల్లా పల్లె ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చారు.
అసువులు బాసిన సమరయోధులు
అప్పటి రాజమండ్రి డీఎస్పీ ముస్తఫా ఆలీఖాన్ కరుడుగట్టిన బ్రిటిష్‌వాది. అతను అప్పటికే సీతానగరంలోని గాంధీ ఆశ్రమాన్ని చిన్నాభిన్నం చేసి, అక్కడి వారిని రక్తమోడేలా కొట్టడంతో బ్రిటిష్ అధికారుల మన్ననలు పొందాడు. ఇక్కడ అతడే రంగంలోకి దిగాడు. రథంపై జెండాను తీసేయాలని, గాంధీ చిత్రాన్ని తొలగించాలని దేశభక్తులను హెచ్చరించాడు. అతడి హెచ్చరికలకు వారెవ్వరూ వెనక్కి తగ్గకుండా, రథాన్ని ముందుకు నడిపించారు. ఈ తరుణంలో గాల్లో కాల్పులు జరిపినా.. ఎవరూ బెదరలేదు. పరిస్థితి చేజారుతుందని గ్రహించిన ఆలీఖాన్.. దేశభక్తులపై తన బలగాలతో తూటాల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ఎందరో అమరులయ్యారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. అయినా దేశభక్తులు ప్రాణభయంతో పారిపోలేదు. బ్రిటిష్ సైనికులపై తిరగబడ్డారు. దీంతో ఆలీఖాన్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. కొత్తపేట తాలూకాకు చెందిన కరటూరి సత్యనారాయణ, పాతపాటి వెంకటరాజు, వాడపల్లి గంగాచలం అమరులయ్యారు. అలాగే బండారు నారాయణస్వామికి బుల్లెట్ గాయాల కారణంగా రెండు కాళ్లు తొలగించినా ప్రాణం దక్కలేదు.
సమరయోధులపై కేసులు
ఆ స్వాతంత్య్ర ప్రతిఘటనను కుట్రగా పేర్కొని, ఆనాటి సమరయోధులైన నంబూరి జగ్గరాజు, నామన బాపన్న, పెన్మెత్స సత్యనారాయణ రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, పెన్మెత్స వెంకట నరసింహరాజు, చేకూరి సూర్యనారాయణ రాజు, చేకూరి రామరాజు, ముదునూరి గనిరాజు, మెర్ల శాస్త్రులు, సాగిరాజు వెంకట సుబ్బరాజు, సాగిరాజు వెంకటరాజు, తూము వెంకన్న, ముదునూరి నారాయణరాజు, ఇందుకూరి సూర్యనారాయణ రాజు, సఖినేటి సుబ్బరాజు, నంబూరి తాతరాజు, దంతులూరి లక్ష్మీపతి రాజు, పడాల సుబ్బారెడ్డి, దండు జగ్గరాజు, ముదునూరి సుబ్బరాజు, మైపాల రామన్న, ఇందుకూరి రామరాజు, ముదునూరి సూర్యనారాయణ రాజు, మద్దిపాటి సత్యనారాయణను బ్రిటిష్ పోలీసులు దోషులుగా చిత్రించారు. అయితే పోలీసుల అభియోగం దారుణమని, దోషులుగా పేర్కొన్న వారంతా నిర్దోషులని 1931 నవంబర్ 23న జిల్లా న్యాయాధిపతులు జస్టిస్ కేపీ లక్ష్మణరావు, జస్టిస్ ఎంఆర్ శంకరయ్య తీర్పు చెప్పారు. నిందితులకు అండగా ఈ కేసు సాక్షులను కళా వెంకట్రావు సేకరించారు.
వాడపల్లి క్షేత్రంలో స్వాతంత్య్ర పోరాటం
వెంకన్న కల్యాణోత్సవ రథంపై జెండా
ఎగురవేశారని దేశభక్తులపై బ్రిటిష్ వారి కాల్పులు
అమరులైన అనేక మంది..
మరెందరో క్షతగాత్రులు
ఆనాటి సంఘటనకు సాక్షిగా
ఆలయం వద్ద స్మారక స్థూపం
భక్తులు తిలకించేలా
వెలుగులోకి తెచ్చే ప్రణాళిక
వాడపల్లిలో జరిగిన ఆ వీరోచిత సంఘటన బ్రిటిష్ వారినే ఆశ్చర్యపరచింది. ఆ ఘటనలో అసువులు బాసిన అమర వీరులు, క్షతగాత్రులు రక్తం చిందించిన ఆ పవిత్ర ప్రదేశంలో నిర్మించిన స్మారక చిహ్నమే ఈ స్థూపం. వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం ముందు స్వాతంత్య్ర సమరయోధుల శిలాఫలకాన్ని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన వెంకటసూర్య సుబ్బరాజు (ఎంవీఎస్ సుబ్బరాజు) నెలకొల్పారు. దానిని 1987 అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు.
సుందరమైన పార్కు
ఆలయానికి ఎదురుగా ఏడు వారాలు–ఏడు ప్రదర్శనలు చేసే మార్గంలో ఉన్న ఈ స్థూపాన్ని మార్చడానికి దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి స్మారక స్థూపాన్ని కొత్తగా నిర్మిస్తున్న కోనేరు వద్ద ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్, ప్రజాప్రతినిధుల దృష్టిలో పెట్టారు. వారు సానుకూలంగా స్పందించి, అనుమతులు ఇచ్చారు. భక్తులకు ఈ క్షేత్రంలో దేశభక్తుల విశిష్టతను తెలియజేసేలా సుందరమైన పార్కును నిర్మించి, మధ్యలో స్మారక స్థూపానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. ఇన్నాళ్లూ ఓ పక్కన ఉన్న స్మారక స్థూపాన్ని వెలుగులోకి తెచ్చే ప్రక్రియకు ఈ నెల 15 తర్వాత శ్రీకారం చుట్టనున్నారు.

చరిత్ర పుటల్లో రక్తాక్షరాలు